తెలంగాణ థియేటర్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు, సినిమా థియేటర్లు కేవలం షేర్ ఆధారిత వ్యవస్థపైనే నడపాలని నిర్ణయించారని, అలాగే కొంత పర్సంటేజ్ పద్దతుల్లో థియేటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారని కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది.
ఈ నెల 18న తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరగనుందని, ఇందులో పలు సమస్యలపై చర్చిస్తామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై కూడా చర్చ జరుగుతుందని టీఎస్ఎఫ్సీసీ అధ్యక్షుడు సునీల్ నారంగ్, సెక్రటరీ కె.అనుపమ్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.