Kantara Chapter 1 | కన్నడ చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి, తాజాగా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో యువరాణి పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తన నటన, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులతో అందరినీ ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ఫేమ్ పెరిగిపోవడంతో నెటిజన్లు “రుక్మిణి వసంత్ ఎవరు?” అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పఠాన్‌కోట్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో సేవలు అందించారు. 2007లో ఉరి సెక్టార్ వద్ద ఉగ్రవాదుల దాడిని ధైర్యంగా ఎదుర్కొంటూ వీర మరణం పొందారు.ఈ యుద్ధంలో ఆయన ఛాతిలో ఏకంగా ఏడు బుల్లెట్లు తగిలినట్లు సమాచారం. దేశం కోసం ప్రాణం అర్పించిన కల్నల్ వసంత్‌కు భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక గౌరవం ‘అశోక చక్రను ప్రదానం చేసింది. కేవలం ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన రుక్మిణి వసంత్, తండ్రి జ్ఞాపకాలను ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం తండ్రి జయంతి, వర్ధంతి రోజున ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్టులు చేస్తూ ఉంటారు.
రుక్మిణి తల్లి సుభాషిణి, ప్రసిద్ధ భరతనాట్యం నర్తకి. భర్త మరణం తర్వాత ‘వీర్ రత్న ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి, తనలాంటి సైనిక భార్యలకు మద్దతుగా నిలబడుతున్నారు. అంటే, రుక్మిణి తల్లిదండ్రులు ఇద్దరూ దేశం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న రుక్మిణి వసంత్, కేవలం అందంతోనే కాకుండా తన నటనతోనూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంతో పాటు, యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తోంది.