Neha Shetty | ‘నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నవా రాధికా…!’ ఏ ముహూర్తంలో టిల్లూ ఈ మాటన్నాడో గానీ, తెలుగు యువతంతా రాధిక కబుర్లలోనే మునిగిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కన్నడ కస్తూరి రీల్స్ మహారాణి అయ్యింది. నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న నేహా శెట్టి ఇప్పుడు కాస్త బిజీ అంటున్నది. ‘డీజే టిల్లూ’ తర్వాత ఏడాదిన్నర గ్యాప్‌తో వరుసగా మూడు సినిమాలతో బాక్సాఫీస్‌పై దండెత్తి వస్తున్న ఈ టిల్లూ బ్యూటీ చెప్పిన సంగతులు చదివేయండి..
నేను ఏదో అవ్వాలనుకొని యాక్టర్ అయిపోలేదు. చిన్నప్పటి నుంచి నటి కావాలని బలంగా కోరుకునేదాన్ని. అందుకు తగ్గట్టుగా నా కెరీర్ ప్లాన్ చేసుకున్నా. అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాలుగు నెలలు యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నా. ఇండియాకు వచ్చాక కన్నడలో మొదటి అవకాశం వచ్చింది.
‘మెహబూబా’ తెలుగులో నా మొదటి సినిమా. 2018లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మీకు పరిచయమయ్యా. ఆ సినిమా ఫలితం గురించి పక్కనపెడితే తెలుగువారి ఆదరణ నాకు కొండంత బలాన్నిచ్చింది. అవకాశాల కోసం ప్రయత్నాల్లో ఉన్న తరుణంలోనే కరోనా వచ్చిపడింది. లాక్డౌన్ కారణంగా ఆదిలోనే నా కెరీర్‌కు కామా పడ్డట్టయింది. కొవిడ్ తగ్గుముఖం పట్టాక ‘డీజే టిల్లు’తో సూపర్‌హిట్ చిత్రం నా ఖాతాలో పడింది.
సినిమాల్లోకి రావడం అంత ఈజీగా ఏం జరగలేదు. ‘మెహబూబా’ తర్వాత ‘గల్లీ రౌడీ’ కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఓకే! ‘డీజే టిల్లు’తో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘రాధిక’ పాత్ర పేరుతోనే పిలుస్తున్నారు. అంతగా ఫేమస్ అయిపోయింది ఆ క్యారెక్టర్. నా కెరీర్‌కు ఊపునిచ్చిన సినిమా అది. ఐ లవ్ రాధిక!
మొదట్లో తెలుగులో మాట్లాడాలంటేనే భయంగా అనిపించింది. కానీ, నేను ఏదైనా త్వరగా నేర్చుకుంటా. డ్యాన్స్ కూడా బాగా వచ్చు. మా అమ్మది కూర్గ్. నాన్నది మంగళూరు. ఆయా ప్రాంతాల్లో మాట్లాడే కొడుగు, తుళు భాషలు వచ్చేశాయి. కర్ణాటకలో పుట్టి పెరగడంతో కన్నడం మీద పట్టుంది. హిందీ, ఇంగ్లిష్ కూడా బాగానే వచ్చు. టాలీవుడ్‌కు వచ్చాను కదా.. తెలుగు కూడా నేర్చుకున్నా. ప్రత్యేకంగా ట్యూటర్‌ను పెట్టుకున్నది ఏం లేదు! విని నేర్చుకున్నదే! ఇప్పుడు తెలుగులో చక్కగా మాట్లాడగలుగుతున్నా. ఇక తమిళం, మలయాళం నేర్చుకోవాల్సి ఉంది.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అని అడుగుతుంటారు. ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు. ఏ దారిలో వెళ్తామని ఎలా చెప్పగలం? హార్డ్‌వర్క్ చేయడం ఒకటే మనం చేయాల్సింది. ఫలితం అంటారా! మన కష్టంలో నిజాయితీ ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది అని నమ్ముతాను. అన్ని రకాల పాత్రలు చేయాలన్నది నా ఉద్దేశం. ప్రస్తుతానికైతే చేతినిండా సినిమాలు ఉన్నాయి. మంచి ఆఫర్లూ వస్తున్నాయి. అవకాశం వస్తే బాలీవుడ్లో నటించాలని ఉంది. డెస్టినీ ఎలా ఉందో చూడాలి మరి!
ఇప్పటికైతే మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కార్తికేయతో నటించిన ‘బెదురులంక 2012’లో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించా. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో విశ్వక్సేన్తో నటించా. కిరణ్ అబ్బవరంతో చేసిన ‘రూల్స్ రాజన్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మరిన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. కాస్త బిజీగానే ఉన్నానని చెప్పాలి!!
“Neha Shetty | పింక్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న నేహా శెట్టి..”