Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ మూవీని బుచ్చిబాబు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ముప్పై శాతం పూర్తైందని ఇటీవల రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. రంగస్థలంను మించేలా ఉంటుందని కూడా తెలియజేశారు. ఈ చిత్రం పూర్తిగా ఎమోషనల్ రైడ్ అని అన్నాడు బుచ్చిబాబు. ఆ మూవీ కథను చాలా ఏళ్లు కష్టపడి రాశాడట. ఇదేమీ పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా కాదు.. కేవలం క్రికెట్ గురించి కాదు.. క్రికెట్ అనేది కేవలం నేపథ్యం.. పూర్తి కథ వేరే ఉంటుందని బుచ్చిబాబు పెద్ది కథ గురించి కొంత హింట్ ఇచ్చారు.
చిత్రాన్ని పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో, విజయనగరం ఏరియాలో జరిగే కథగా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ ఆఫ్ స్క్రీన్ కారెక్టర్‌కు దగ్గరగా ఈ పెద్ది పాత్ర ఉంటుందట. చిట్టి బాబు కథ రంగస్థలం అయితే.. ఈ పెద్ది కథ వేరేలా ఉంటుందని బుచ్చిబాబు సినిమాపై హైప్ భారీగానే పెంచాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అందరికీ అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మొన్నామధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పెద్ది గ్లింప్స్ కేవలం మెగా ఫ్యాన్స్‌నే కాకుండా యాంటీ ఫ్యాన్స్ ను కూడా అలరించింది.
కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ లండన్ వెళ్లడంతో షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇక తిరిగిరావడంతో పెద్ది సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మే 16 నుంచి జరుగుతుందని తెలుస్తోంది. పది రోజుల పాటూ జరిగే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటూ హీరోయిన్ జాన్వీ కపూర్, మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు మీర్జా పూర్ ఫేమ్ మున్నా భాయ్ అలియాస్ దివ్యేందు శర్మ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పెద్ది మూవీని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.