Divaynsha Kaushik | ‘మజిలీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఢిల్లీ భామ దివ్యాంశ కౌషిక్. తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. రెండు మూడు మంచి ఆఫర్స్ వచ్చినా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. రవితేజ సరసన నటించిన ‘రామారావు ఆన్‌డ్యూటీ’, సందీప్ కిషన్ జోడీగా కనిపించిన ‘మైఖేల్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో ఈ నాయిక కెరీర్ ఢీలా పడింది. అయితే ఆమెకు మరో మంచి ప్రయత్నంగా ‘ఖుషి’ సినిమా దక్కినట్లు తెలుస్తున్నది.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో దివ్యాంశ నటిస్తున్నట్లు సమాచారం. నాయిక సమంతకు సోదరి పాత్రలో ఆమె కనిపించనుందట. కథలో దివ్యాంశ క్యారెక్టర్ కీలకంగా ఉండనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించారు.