‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా రైట్స్ కోసం చాలామంది ప్రయత్నించారు. కానీ మేం ముందు అప్రోచ్ అయినందుకు ్ల నిర్మాతలు మాకే ఇచ్చారు. సినిమా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. అందుకే రెండు తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 500 స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం’ అని నిర్మాత, పంపిణీదారుడు శివప్రసాద్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్‌స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. కృతి శెట్టి కథానాయిక. నయనతార నిర్మాత. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది.
శ్రీపద్మిని సినిమాస్ ద్వారా నిర్మాత శివప్రసాద్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘ఫ్యూచర్ టెక్నాలజీ ఆధారంగా డిజైన్ చేసుకున్న ప్రేమకథ ఇది. మానవీయ విలువలు, భావోద్వేగాలపై టెక్నాలజీ ప్రభావం చూపిస్తే? అనే ప్రశ్నకు సమాధానం ఈ సినిమా. ప్రదీప్‌రంగనాథన్ నటన, విగ్నేష్ శివన్ మేకింగ్, అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాలు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చారు శివప్రసాద్.