‘దయా’ వెబ్‌సీరిస్ కథను సినిమాగా చేస్తే ఇంత డీటెయిల్డ్‌గా, ఎక్కువ పాత్రలతో తెరకెక్కించడం సాధ్యం కాకపోయేది. వెబ్‌సీరిస్ కాబట్టి క్రియేటివ్ ఫ్రీడమ్ వుంటుంది’ అన్నారు దర్శకుడు పవన్ సాధినేని. ఆయన దర్శకత్వంలో రూపొందిన వెబ్ సీరిస్ ‘దయా’. జేడీ చక్రవర్తి, ఈషారెబ్బా, రమ్య నంబీసన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ వెబ్ సీరిస్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా వుంది.
బెంగాలీ వెబ్ సీరిస్ ‘తక్థీర్’ను ప్రేరణగా తీసుకుని ‘దయా’ కథను రాసుకున్నాను. అయితే తక్ధీర్లో కథ ఇంత విస్తృతంగా ఉండదు. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న సిరీస్‌లో అందరూ చూస్తుంది కేవలం గ్లింప్స్ మాత్రమే. దయా, అలివేలు పాత్రల్లో వుండే ట్విస్ట్‌లు అన్ని సెకండ్ సీజన్లో వుంటాయి. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే మొదటిభాగం మంచి హిట్ అయ్యింది. ఇక సెకండ్ సీజన్‌ను మరింత పెద్ద స్పాన్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్గా డబుల్ స్కేలో చెయబోతున్నాం. ఇకపై సినిమాలతో పాటు వెబ్‌సీరిస్‌లు కూడా చేస్తాను. త్వరలో గీతాఆర్ట్స్‌లో ఓ చిత్రం చేస్తున్నాను’ అన్నారు.