Mithun Chakraborty | ‘ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్..’ అంటూ తనదైన సిగ్నేచర్ నృత్యంతో ఎనభై దశకంలో యువతరాన్ని ఉర్రూతలూగించిన విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తికి సోమవారం కేంద్ర ప్రభుత్వం భారతీయ సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కేను ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు. ఆశాపరేఖ్, ఖుష్బూ సుందర్, విపుల్ అమృత్షాలతో కూడిన జ్యూరీ మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేశారు. ‘డిస్కో డ్యాన్సర్’గా నాటి ప్రేక్షకులకు సుపరిచితుడైన మిథున్ చక్రవర్తి చిత్ర పరిశ్రమలో బెంగాల్ టైగర్ అనే గుర్తింపును పొందారు. మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకొని రికార్డు సృష్టించారు.
ఉద్యమాల నుంచి హీరోగా ప్రస్థానం
మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగా చక్రవర్తి. బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి దంపతులకు 1950 జూన్ 16న కోల్‌కతాలో జన్మించారు. బిఎస్సీ కెమిస్ట్రీతో పాటు పూనే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ నుంచి డిగ్రీలు పొందారు. అనంతరం భుస్వామ్య, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడు జరిగిన నక్సల్ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అయితే సోదరుడి అకాల మరణంతో కలత చెందిన ఆయన కోల్‌కతాను వదిలి బతుకుతెరువు కోసం ముంబయిలో అడుగుపెట్టారు. తొలుత చిన్న ఉద్యోగాలు చేస్తూ ఓ నైట్‌క్లబ్‌లో డ్యాన్సర్‌గా చేరారు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నృత్యంలో అతని ప్రతిభను చూసి అక్కడకొచ్చిన సినీ ప్రముఖులు మెచ్చుకునేవారు. దాంతో సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు
‘మృగయా’ చిత్రంతో సినీరంగ ప్రవేశం
మృణాల్‌సేన్ దర్శకత్వంలో రూపొందిన ‘మృగయా’ (1978) చిత్రం ద్వారా మిథున్ సినీ రంగ ప్రవేశం చేశారు. అద్భుత నటనకుగాను తొలి చిత్రంతోనే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. అదే ఏడాది ‘నది తేకే సాగరే’ సినిమా ద్వారా బెంగాలీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. అనంతరం సురక్ష, షౌకిన్, అశాంతి, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ఘర్ ఏక్ మందిర్, గురు, తరానా, వర్ధత్, బాక్సర్, అగ్నిపథ్, జల్లాద్, కమాండో, ప్యార్ ఝుక్తా నహీ వంటి చిత్రాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. మృగయా, తహదీర్ కథా చిత్రాలకు ఉత్తమ నటుడిగా, స్వామి వివేకానంద (1998) చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. 80, 90 దశకాల్లో అగ్ర హీరోల్లో ఒకరిగా మిథున్ చక్రవర్తి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తెలుగు, కన్నడ, ఒరియా భాషల్లో 350కిపైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో గోపాల గోపాల, మలుపు చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై ప్రయోక్తగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మిథున్ చక్రవర్తి.
‘డిస్కో డ్యాన్సర్’తో యువతలో క్రేజ్
1982లో విడుదలైన ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం మిథున్ చక్రవర్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్’ పాట నాటి యువతను ఉర్రూతలూగించింది. ఈ పాట అంతర్జాతీయంగా మిథున్ చక్రవర్తికి పాపులారిటీ తీసుకొచ్చింది. ఆ రోజుల్లోనే సిక్స్‌ప్యాక్‌తో కూడిన దేహదారుడ్యంతో పాటు బ్రేక్ డ్యాన్సులు, అద్భుతమైన ఫైట్లతో యాక్షన్ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. 1989లో ఒకే ఏడాదిలో అత్యధికంగా 19 సినిమాలు చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలిసారి వందకోట్లు వసూలు చేసిన చిత్రంగా ‘డిస్కో డ్యాన్సర్’ చరిత్ర సృష్టించింది.
రాజకీయరంగ ప్రవేశం
నటనతో పాటు సినీ నిర్మాణం, హోటల్ వ్యాపారంలో మిథున్ చక్రవర్తి రాణించారు. 80, 90 దశకాల్లో అగ్రశ్రేణి వ్యాపార సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2014లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2021లో బీజేపీలో చేరారు. అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మిథున్ చక్రవర్తి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనున్నారు.