‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ రెండు నెలలకు ముందే సంక్రాంతి సందడిని షురూ చేసేశారు వెంకటేశ్. ప్రసుతం ఆ సినిమా ప్రమోషన్లో ఆయన బిజీబిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ సినిమా విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఓ వైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్లో బిజీగా ఉంటూ.. మరోవైపు తరువాతి సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను కూడా కానిచ్చేస్తున్నారు వెంకీ. ఇటీవలే ఓ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పేశారట. వివరాల్లోకెళ్లే.. ‘డీజే టిల్లు’తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు విమల్‌కృష్ణ.. వెంకీ కోసం ఓ కథ తయారు చేసుకున్నారట. రీసెంట్గా ఆ కథ విన్న వెంకటేష్, సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పేశారట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ సినిమా షూటింగ్ మొదలుకానుంది. చిట్టూరి శ్రీను ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ఫిల్మ్‌వర్గాల సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలను కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకున్నారట. ‘డీజే టిల్లు’ తరహాలోనే ఆద్యంతం కామెడీతో ఈ కథ సాగుతుందని తెలుస్తున్నది.