నీది నాది ఒకే కథ, విరాట పర్వం లాంటి విలక్షణమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ముద్ర వేశాడు వేణు ఊడుగుల (Venu Udugula). ఆయన ఒక సినిమాకి షోరన్నర్‌గా ఉన్నారంటే ఖచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju weds Rambai) కూడా అలానే ఆకర్షించింది. దీంతో పాటు ఈ సినిమా ట్రైలర్, సాంగ్ జనాల్లోకి వెళ్ళాయి. ఇందులో ఒక సంచలనమైన క్లైమాక్స్ వుంటుందనే ప్రచారం కూడా బాగా కలిసొచ్చింది. ఏమిటా సంచలనమైన ముగింపు? ఈ ప్రేమకథ ప్రేక్షకులని ఎంతలా హత్తుకుంది? (Raju Weds Rambai Movie Review) రివ్యూలో చూద్దాం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు వరంగల్ – ఖమ్మం ప్రాంతంలో జరిగే కథ ఇది. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొట్టడంలో దిట్ట. అదే గ్రామానికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని ప్రేమిస్తాడు. రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుర్రాడినే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. దీంతో రాజు–రాంబాయి తమ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఏమిటా నిర్ణయం ? వెంకన్న వారి పెళ్లిని ఆపడానికి ఏ స్థాయికి దిగజారాడు? వారి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది మిగతా కథ.
హానర్ కిల్లింగ్ జానర్ కథ ఇది. అన్ని వర్గాలు, స్థాయిల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పడం ఇందులో స్పెషాలిటీ. ఇందులో హత్య వుండదు కానీ ఉప్పెన సినిమా తరహలో క్లైమాక్స్ హార్డ్ హిట్టింగ్ గా వుంటుంది. నిజానికి ఆ సంఘటన ఆధారంగానే ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఇంపాక్ట్ ఫుల్ గా కుదిరాయి. మిగతా భాగాల్లో వినోదం సాదాసీదాగానే వున్నాయి.
పెళ్లికి ముందే గర్భవతి అయిన ఓ ప్రేమజంట పెళ్లి తంతుని చూపిస్తూ కథ మొదలౌతుంది. రాజు, రాంబాయ్, ఫ్రెండ్స్ గ్యాంగ్ లో మాస్ కామెడీ వినోదాన్ని పంచుతాయి. రాంబాయి ప్రేమకథ వెంకన్నకు తెలియడంతో కథలో ఓ సంఘర్షణ వస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా వుంటుంది. కాకపొతే సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించింది. అయితే దర్శకుడు బలంగా నమ్మిన క్లైమాక్స్ ఇంపాక్ట్ ఫుల్ గా కుదిరింది. ఇటీవల కాలంలో ఈ తరహా క్లైమాక్స్ రాలేదని చెప్పొచ్చు … షో రన్నర్ వేణు ఊడుగుల తాలూకు సెన్సిబిలిటీస్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపించాయి ..మొత్తంగా ప్రేక్షకులు ఓ హృద్యమైన ప్రేమకథ చూశామనే భావనకు లోనవుతారు ..
రాజు పాత్రలో అఖిల్ చలాకీగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ బాగా రాణించాడు. రాంబాయిగా తేజస్వినీ నటన సహజంగా వుంది. తెలంగాణ యాస పలికిన విధానం బావుంది. వెంకన్నగా చైతన్య జొన్నలగడ్డ విలనిజం కాస్త డిఫరెంట్ గా వుంటుంది. ట్రైలర్ లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది కానీ సినిమాలో అది భిన్నంగా వుంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో డాంబర్ పాత్ర అలరిస్తుంది.
సురేశ్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. కథని ఆయన సంగీతం ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. సంభాషణలు సహజంగా వున్నాయి. దర్శకుడు కథని నిజాయితీ చెప్పే ప్రయత్నం చేశాడు. సహజమైన ప్రేమకథని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మరింతగా నచ్చుతుంది.
రాజు, రాంబాయి పాత్రలు, నటన, సంగీతం, క్లైమాక్స్
సెకండ్ హాఫ్ సాగదీత
కొన్ని రొటీన్ సన్నివేశాలు
రేటింగ్: 3/5