‘సుబ్రహ్మణ్యం అనే జర్నలిస్ట్ రాసిన కథ ఇది. ఈ కథలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ హైలైట్. అద్భుతమైన డ్రామా. ఎక్కడా బోర్ కొట్టదు. హీరో అంకిత్ సహజమైన నటన కనబరిచాడు. ఎంతో కష్టపడి అంకితభావంతో నటించాడు. హీరోయిన్ అయితే.. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. ఇది సందేశం, వినోదంతో కూడిన కుటుంబ కథ. అందుకని క్లాసులు పీకడాలు ఏవీ ఉండవ్. ఒక జీవితం చూపిస్తాం.. అంతే…’ అన్నారు డైరెక్టర్ జె.ఎస్.ఎస్.వర్ధన్. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించారు.
విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ కలిసి నిర్మించారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సమర్పణలో ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు వర్ధన్ విలేకరులతో ముచ్చటించారు. ‘నా తొలి అవకాశం ‘భలే వున్నాడే’ మారుతీగారి వల్లే వచ్చింది. ఇప్పుడు ‘బ్యూటీ’ కూడా ఆయనే పిలిచి అవకాశం ఇచ్చారు. సినిమా చూసి ఆయనెంతో మెచ్చుకున్నారు. కేవలం 5 నిమిషాలు కట్ చేయమని సూచించారు. ఆయన చెప్పాక నేను చూసి ఏడు నిమిషాలు కట్ చేశాను. ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్ చెప్పే సినిమా ఇది’ అని తెలిపారు వర్థన్.