“శంబాల” కథ కోసం ఎంతో పరిశోధన చేశా. ఓ ప్రాంతంలో ఉల్క పడితే ఎలా ఉంటుంది అనే విషయం గురించి విస్తృత సమాచారాన్ని సేకరించా. బ్రెజిల్లో జరిగిన ఓ సంఘటన మీద కూడా రీసెర్చ్ చేశాం’ అన్నారు చిత్ర దర్శకుడు యుగంధర్ ముని. ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా శుక్రవారం దర్శకుడు యుగంధర్ ముని విలేకరులతో ముచ్చటించారు. సైన్స్‌ను, మన శాస్ర్తాలను బ్యాలెన్స్ చేస్తూ ఈ కథ రాసుకున్నానని, ఎవరి మనోభావాలను కించపరచకుండా సినిమా తీశానని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది.
ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఇప్పటి విజ్ఞాన అంశాల్ని మన శాస్ర్తాల్లో ఎప్పుడో పొందుపరిచారు. ఈ సినిమాలో సైన్స్, సంస్కృతిని బ్యాలెన్స్ చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. ఈ సినిమా కోసం హీరో ఆది చాలా హార్డ్‌వర్క్ చేశారు. గాయలైనా సరే పట్టించుకోకుండా పని చేశారు’ అన్నారు. ఈ చిత్రానికి తమిళనాడు, కర్ణాటకలో కూడా మంచి స్పందన లభిస్తున్నదని, తనకు సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్ అంటే చాలా ఇష్టమని, ఇదే సంస్థలో మరో సినిమా చేయబోతున్నానని యుగంధర్ ముని పేర్కొన్నారు.