Samantha | అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన ‘జిగ్రా’ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, రానా, సమంత అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో సమంతను ప్రశంసలతో ముంచెత్తారు త్రివిక్రమ్. దక్షిణాదిలో రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్‌బేస్ సమంతకు మాత్రమే ఉందన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్-సమంత మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది.
‘మీరు ముంబయికి మాత్రమే పరిమితం కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాలకు కూడా రావాలి. ఇక్కడ సినిమాలు చేయండి. మీరు సినిమాలు చేయరేమో అనే భయంలో మేము రాయడం లేదు. మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తాం. మీరు ఇక్కడకు రావాలంటే మేమంతా కలిసి ‘అత్తారింటికి దారేది’ తరహాలో ‘సమంత హైదరాబాద్ రావడానికి దారేది’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయాలేమో’ అని త్రివిక్రమ్ సరదాగా మాట్లాడారు. మీరు రాస్తే తప్పకుండా తాను ఇక్కడకు వస్తానని సమంత నవ్వుతూ సైగల ద్వారా త్రివిక్రమ్ మాటలకు బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.