‘సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇది మీ అందరి ఎనర్జీ వల్ల వచ్చిన విజయం. మీ అందరూ కష్టపడి, ఫలితాన్ని మాత్రం నాకిచ్చారు. అయిదేళ్లు మా అందర్నీ బాగా చూసుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్. క్యూబా కెమెరా, దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. చీఫ్ టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టారు. ఇక ప్రేక్షకులు ఈ సినిమాపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను. మ నం ఎంత కష్టపడ్డా.. అందరికీ హిట్ ఇచ్చేది దర్శకుడొక్కరే. ఈ సినిమాకు పనిచేసిన అందరం సుకుమార్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఈ విజయం ఆయనదే. పుష్ప ఫ్రాంచైజీ ద్వారా మా అందరి జీవితాలు సార్థకమయ్యాయ్.
చివరిగా ఈ విజయాన్ని నా అభిమానులకు డెడికేట్ చేస్తున్నా. ’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన చిత్రం ‘పుష్ప2’. ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఆలిండియా రికార్డులను తిరగరాసింది. చిత్ర నిర్మాతలు నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రం థ్యాంక్స్ మీట్‌ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. సినిమాకు పనిచేసిన అందరికీ పేరుపేరున దర్శకుడు సుకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. దేవిశ్రీప్రసాద్, బన్నీవాసు, సునీల్, నవీన్ నూలి, ఎస్కేఎన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.