హాలీవుడ్లో విశేషమైన ఆదరణ పొందిన ‘హ్యారీ పోటర్’ సిరీస్ తరహాలో భారత్లో కూడా ఫ్రాంచైజీ చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ వెల్లడించారు. ఇటీవల ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘భారతీయ ఆత్మతో హ్యారీ పోటర్ తరహాలో అద్భుత ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నా.
వాస్తవానికి భారతీయ మార్కెట్ చాలా విస్త్రతమైనది. ఫాంటసీ కథాంశాల విషయంలో మన ప్రేక్షకులు ఎక్కువగా పాశ్చాత్య చిత్రాల్ని వీక్షిస్తున్నారు. అందుకే హ్యారీ పోటర్కు సమానమైన భారతీయ ఫ్రాంచైజీ చిత్రాలకు రూపకల్పన చేయాలనుకుంటున్నా. త్వరలో ఈ పనుల్ని మొదలుపెడతా’ అన్నారు. మిస్టర్ ఇండియా, బాండిట్ క్వీన్, ఎలిజబెత్, ఫోర్ ఫెదర్స్ వంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందారు శేఖర్ కపూర్.