తొలి సినిమాతోనే కల్ట్ మూవీ డైరెక్టర్ అనిపించుకోవడం చిన్న విషయంకాదు. అది తెలుగుచలనచిత్ర చరిత్రలో ఇద్దరి వల్లే అయ్యింది. వారిలో తొలి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అయితే.. రెండో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. రెండో సినిమా ‘కబీర్‌సింగ్’తో తెలుగు సినిమా జెండాను బాలీవుడ్లో సైతం రెపరెపలాడించిన దర్శకుడాయన. మూడో ప్రయత్నంగా సందీప్ నుంచి వస్తున్న సినిమా ‘యానిమల్’. రణ్‌బీర్‌కపూర్, అనిల్‌కపూర్, బాబీడియోల్, రష్మిక మందన్నా ప్రధాన భూమికలు పోషించారు. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డి శనివారం విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
సినిమాకి ‘యానిమల్’ అని పేరు పెట్టడానికి గట్స్ కావాలి. ఎందుకు పెట్టారు ఆ పేరు?
మనిషి ఓ సోషల్ యానిమల్. కాస్త జ్ఞానం తోడవ్వడంతో జీవరాశుల్లో మనకు లీడర్ షిప్ వచ్చిందని నా ఉద్దేశం. జంతువులు తమ కుటుంబాన్ని విపరీతంగా ప్రేమిస్తాయి. సొంతమైన వాటికోసం ప్రాణాలను పణంగా పెడతాయి. ఇందులో హీరో కూడా అంతే.. తండ్రి కోసం ఎంతదూరమైనా వెళతాడు. కుటుంబాన్ని విపరీతంగా ప్రేమిస్తాడు. అందుకే ఈ పేరు పెట్టా. ‘అరవింద సమేత వీరరాఘవ’ అని పేరు పెట్టడం కష్టం. అది త్రివిక్రమ్ మాత్రమే పెట్టగలరు. ‘యానిమల్’ అనే పేరు ఎవరైనా పెడతారు. నాకు నచ్చింది. అదృష్టం బావుండీ ఎవరూ ఆ టైటిల్‌ని రిజిస్టర్ చేసుకోలేదు. నా సినిమాకు పెట్టుకున్నాను.
ట్రైలర్ చూస్తుంటే ఇది తండ్రీకొడుకుల కథలా అనిపిస్తుంది?
అవును ఇది తండ్రీకొడుకుల కథ. తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు కథ ఇది.
ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగమవ్వడానికి కారణం?
క్రియేటివ్‌గా నన్ను క్రిటిసైజ్ చేసే ఏకైక వ్యక్తి మా బ్రదర్ ప్రణయ్‌రెడ్డి వంగా. అలాంటి వ్యక్తి ప్రొడక్షన్లో ఉంటే క్రియేటీవ్‌గా కూడా మంచిది కదా. ఇక భూషణ్గారితో ‘కబీర్‌సింగ్’ చేశాం. తెలిసిన నిర్మాత కాబట్టి అలా కంటిన్యూ అవుతున్నది.
అనిల్‌కపూర్ కేరక్టరైజేషన్ ఎలావుంటుంది?
అతని వల్లే, అతని కోసమే నడిచే కథ ఇది. ఈ పాత్రను అనిల్‌కపూర్ మాత్రమే ఆ స్థాయిలో చేయగలరు.
రష్మిక పాత్ర ఎలా ఉంటుంది?
రణ్‌బీర్ తర్వాత ఈ కథలో ముఖ్య పాత్రలు అంటే అనిల్‌కపూర్, రష్మిక పాత్రలే. భర్త వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న భార్యగా ఇందులో రష్మిక కనిపిస్తుంది. చాలా గొప్పగా నటించింది కూడా. హీరోహీరోయిన్ల ప్రేమకథ నుంచే ఈ సినిమా అసలు కథ మొదలయ్యేది. తన పాత్రను రష్మిక ఎంత ప్రేమించిందంటే.. హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.
‘అర్జున్‌రెడ్డి’ మాదిరిగానే ఇందులో కూడా హీరోకి కోపం ఎక్కువ అనుకుంటా?
ఇద్దరూ చాలా సిన్సియర్ ఫెలోస్. అదొక్కటే వీళ్లిద్దరికీ కామన్ ఫ్యాక్టర్. అర్జున్‌రెడ్డికి కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేడు. కానీ ఈ పాత్రకు మనందరికీ ఉన్నట్టే సిట్యువేషన్‌ని బట్టి కోపం తీవ్రత ఉంటుంది. ‘అర్జున్‌రెడ్డి’ లాగే ఇదికూడా క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. మిగిలిందంతా కంప్లీట్ డిఫరెంట్. తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకు పాత్ర రాసుకున్నప్పుడు పాత్రలో ఆ మాత్రం ఉద్వేగాలు ఉండటం కామన్ కదా.
మీ హీరోలు పెక్యులర్‌గా ఉంటారు. మీ మెంటాలిటీకి దగ్గరగా ఉండేలా పాత్రల్ని క్రియేట్ చేస్తారా?
(నవ్వుతూ) నాకూ నా పాత్రలకు అస్సలు సంబంధం లేదండీ. నచ్చినట్టు రాసుకుంటాను తప్ప వాటిపై నాదే కాదు, ఎవరి ప్రభావం ఉండదు.
ట్రైలర్లో చూస్తుంటే ఎమోషన్ని వయోలెన్స్ డామినేట్ చేసిందేమో అనిపిస్తుంది?..
అలాంటిదేం లేదండీ.. అన్నీ కరెక్ట్‌గా బ్యాలన్స్ చేశామనే అనుకుంటున్నాం. మీరే చూసి చెప్పాలి.
మందుతాగి టూవీలరే నడపకూడదు. అలాంటిది మీ హీరో ఏకంగా విమానం నడిపేస్తున్నాడు. అలా చూపించడం సబబేనా?
(నవ్వుతూ) కత్తులతో గొడ్డళ్లతో వందలమందిని తెరపై నరికేస్తే సబబేనా? సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటుంటుంది. సినిమా అంటేనే జనానికి నచ్చే తప్పులు చెయ్యడం. చూడ్డానికి బావుందికదా.. అందుకే పెట్టాను.
బాబీ డియోల్ పాత్ర ఎలా వుంటుంది?
తనది విలన్ పాత్ర. ఆ పాత్ర గురించి ఇప్పుడే రివీల్ చెయ్యలేను..
సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ రావడం.. మూడు గంటల 20 నిమిషాల రన్‌టైమ్ ఉండటం సినిమాకు చిన్నపాటి మైనస్ అని అనుకోచ్చా?
ఏ సర్టిఫికెట్ అంటే పిల్లలు రారు.. కాస్త మైనస్సే. అయితే పిల్లలకోసం కాంప్రమైజ్ అయితే మనం అనకున్న సీన్స్‌లో ఇంటెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి తప్పదు. ఇక రన్‌టైమ్ అంటారా.. ‘అర్జున్‌రెడ్డి’ మూడుగంటల 6 నిమిషాలు.. చూశారుకదా. ఇది ‘అర్జున్‌రెడ్డి’ కంటే ఓ పదిహేను నిమిషాలు ఎక్కువ అంతే. సినిమా బావుంటే రన్‌టైమ్ ప్రాబ్లం కాదు.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ప్రతీకార నేపథ్యంలా అనిపిస్తున్నది. ఈ నేపథ్యాన్ని ఎంచుకోటానికి కారణమేంటి?
ప్రేమ కంటే ప్రతీకారమే పవర్ఫుల్ ఎమోషన్. దాన్ని ఆవిష్కరించడమే కష్టం కూడా. అర్జున్‌రెడ్డికి కోపం వస్తే కొట్టేస్తాడు. వీడు అలాకాదు.. వాడికంటూ ఓ లక్ష్యం ఉంటుంది. ఇందులో ఓ డైలాగ్ కూడా రాశాను.. ‘నాన్నా ఇది ఇప్పుడే మొదలైంది.. వాడ్ని కలవాలి.. వాడ్ని చంపాలి.. చాలా పనుంది.. మీరు నిరాశపడకండి నాన్నా’ అని. ముందు వాడెవడో తెలియాలి కదా. దానికోసం వాడు చేసే ప్రయత్నంలో ఉంటుంది అసలైన ఎమోషన్. అది రేపు తెరపై చూస్తారు.
మీ నెక్ట్స్ సినిమా ‘స్పిరిట్’లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని టాక్. నిజమేనా?
అవును. అది కాప్ స్టోరీ. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది.
రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ తర్వాత మీ ‘అర్జున్‌రెడ్డి’ని చాలామంది కల్ట్ మూవీ అన్నారు. నిజంగా ‘అర్జున్‌రెడ్డి’కి ఆ స్థాయి ఉందనుకుంటున్నారా?
నేననుకోవడం లేదు. నాకెప్పుడూ అది అతిశయోక్తిగానే అనిపిస్తుంది. నేను కథ చెప్పినప్పుడు కూడా చాలామంది అదేమాట అన్నారు. సినిమా విడుదలయ్యాక మీడియా కూడా అదే మాట అనడం చూసి ఆశ్చర్యపోయాను. నిజానికి ‘శివ’ వేరే లెవల్. ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు కొన్ని సీన్లు చూస్తే భయమేసింది. అప్పుడు చిన్నపిల్లాడ్ని. ఆ తర్వాత డిగ్రీ కొచ్చేదాకా కుదిరినప్పుడల్లా చూస్తూనే ఉండేవాడ్ని. అది టైమ్‌లెస్ క్లాసిక్. ‘అర్జున్‌రెడ్డి’ స్థాయేంటో టైమ్ చెబుతుంది. ఓ ఆరేళ్లనుంచి చెప్పుకుంటున్నారు. ఇంకో పదేళ్ల తర్వాత కూడా అలాగే చెప్పుకుంటారేమో చూద్దాం. అప్పటిదాకా ‘శివ’తో పోల్చడం సబబుకాదు.
మీ కెరీర్లో తొలిసారి పెద్ద స్టార్‌తో పనిచేశారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్?
రణ్‌బీర్ చాలా గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. అసలు లొకేషన్లో స్టార్లా బిహేవ్ చేయరు. విజయ్ దేవరకొండతో పనిచేసినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. స్టార్‌తో చేసిన ఫీలే లేదు. అసలు ఈ కథను నేను రణ్‌బీర్‌తో చేద్దామనుకోలేదు. ఫలానా వారితో చేయాలనే క్లారిటీ కూడా లేదు. అనుకోకుండా తను విన్నాడు. నచ్చిందన్నాడు.. అలా కుదిరిపోయింది.
అన్‌స్టాపబుల్‌కి వెళ్లి బాలయ్యను కలిశారు కదా.. ఎక్స్పీరియన్స్?
ఆయన నిజంగా అన్‌స్టాపబుల్. ఆయన ‘మొగల్ ఏ అజామ్’లో పృధ్వీరాజ్కపూర్ డైలాగులు చెబుతుంటే అలా షాక్‌లో వుండిపోయాం. ఎన్టీయార్గారి డైలాగులు చెబితే ఓకే.. పృధ్వీరాజ్కపూర్గారి డైలాగులు కూడా ఆ రేంజ్లో చెప్పడమేంటండీ. రణ్‌బీర్ అయితే, ‘సందీప్.. ఇది మా ముత్తాతగారి సినిమా. ఆయన డైలాగులు నాకే గుర్తులేవ్.. ఏంటి ఈయనా?’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నిజంగా బాలయ్యగారు గ్రేట్.