Director Rohit Shetty | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యాడు. రోహిత్ శెట్టి ప్రస్తుతం ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. ఇందులో భాగంగా కారు ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరుగడంతో రోహిత్ శెట్టి చేతికి గాయమైంది. వెంటనే ఆయనను ఎల్బీ నగర్లో ఉన్న కామినేని హాస్పిటల్‌కు చిత్రయూనిట్ తరలించింది. అయితే రోహిత్ శెట్టికి మేజర్‌గా దెబ్బతగలలేదని తెలుస్తుంది. చేతికి చిన్న గాయమైందని, శనివారం సాయంత్రం డిశ్చార్జ్ అవుతాడని సమాచారం.
ఇటీవలే రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సర్కస్’ రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రణ్వీర్ సింగ్, పూజాహెగ్డే ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించన సెకండ్ డే నుండి ఫుల్ డ్రాప్స్ పడ్డాయి. ఫైనల్‌గా బడ్జెట్లో సగం కూడా రికవరీ చేయకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలుమార్లు తెలిపాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ 8 భాగాలుగా రూపొందుతుంది. అమెజాన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ద్వితియార్థంలో స్ట్రీమింగ్ కానుంది.