శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో సాగే తెలుగుదనం ఉన్న చిత్రమిదని అన్నారు రేవంత్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘నాట్యం’. సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో రేవంత్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
గురువు లక్ష్యాన్ని నెరవేర్చిన ఓ శిష్యురాలి కథ ఇది. గ్రామంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను నాట్యకళ ద్వారా ఓ యువతి ఎలా చెరిపివేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాలు, ఇతిహాస కథలంటే నాకు చాలా ఇష్టం. విఠలాచార్య, కె. విశ్వనాథ్ సినిమాల్ని ఇష్టపడుతుంటాను. వారి సినిమాల శైలిలోనే చరిత్ర, సంస్కృతుల ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ నా మొదటి సినిమా చేయాలనే ఆలోచనతో ఈ కథ రాసుకున్నా. నాట్యశాస్త్ర గ్రంథాలు చదవడంతో పాటు కూచిపూడి, భరతనాట్యం, వెస్ట్రన్ నృత్యాలపై పది నెలల పాటు పరిశోధన చేశా. నాట్యం ద్వారా కథను చెప్పే ప్రయత్నం చేశాను. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఛాయాగ్రాహకుడిగా, ఎడిటర్‌గా పనిచేశాను. నాకున్న అవగాహనతోనే అన్ని భాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించా.
యాక్షన్ కథాంశంతో..
సంధ్యారాజు స్వతహాగా మంచి క్లాసికల్ డ్యాన్సర్. నృత్యప్రధాన కథాంశంతో సినిమా చేయాలనే ఆలోచన ఆమెకు ఉంది. గతంలో మేమిద్దరం కలిసి ఓ లఘు చిత్రం చేశాం. నా ప్రతిభపై ఉన్న నమ్మకంతో పాటు కథ నచ్చడంతో హీరోయిన్గా నటిస్తూనే ఈ చిత్రాన్ని నిర్మించింది. నటనకు పరిమితం కాకుండా అన్ని విభాగాల్లో చక్కటి సహాయసహకారాలు అందించారు. ఆమె అభినయం సినిమాకు ప్రధానాకర్షణగా ఉంటుంది. ఆర్ట్ సినిమాలా కాకుండా కమర్షియల్ హంగులతో తెరకెక్కించాను. తెలుగు ప్రేక్షకులకు చాలా కాలం పాటు గుర్తుండిపోయే మంచి సినిమా అవుతుంది. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో తదుపరి సినిమా చేయాలని అనుకుంటున్నా.