సినీరంగంలో ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ, సరికొత్త కథలను అందించడానికి గొప్ప వేదికగా ‘కథాసుధ’ నిలుస్తుందని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. ఓటీటీ ఛానల్ ఈటీవీ విన్లో కథాసుధ పేరుతో ప్రతీ ఆదివారం ఓ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె.రాఘవేంద్రరావు మాట్లాడారు. నేటితరంలో అద్భుతమైన ప్రతిభావంతులున్నారని, యూట్యూబ్ వంటి వేదికల్లో తమ సత్తాచాటుతున్నారని, అలాంటి వారికి కథాసుధ ప్లాట్‌ఫామ్ ద్వారా అవకాశాలు కల్పిస్తామని, ఇప్పటికే 30నిమిషాల నిడివిగల నాలుగు సినిమాలను 17రోజుల్లోనే పూర్తిచేశామని ఆయన అన్నారు.
తాను చెప్పిన ఐదు కథలను సింగిల్ సిట్టింగ్‌లోనే ఈటీవీ విన్ టీమ్ ఓకే చేసిందని, వాటిని ఇరవై రోజుల్లోనే తీశామని, ఈ కథలన్నీ మర్చిపోలేని అనుభూతులను అందిస్తూ జ్ఞాపకాలను తట్టిలేపుతాయని దర్శకుడు సతీష్ వేగేశ్న తెలిపారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘కుటుంబమంతా చూడదగ్గ కంటెంట్‌తో ఈటీవీ విన్ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నది. కథాసుధ ద్వారా ఇండస్ట్రీకి కొత్త ప్రతిభను పరిచయం చేయడం అభినందనీయం’ అన్నారు. కథాసుధ ద్వారా వచ్చే కథలన్నీ మన హృదయాలకు దగ్గరగా ఉంటాయని నటుడు, రచయిత తనికెళ్ల భరణి పేర్కొన్నారు. ఈ కథలు తప్పకుండా ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకుంటాయని ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి అన్నారు.