‘ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎన్ని కష్టాలు ఎదురైనా.. గౌరవాన్నీ, మృదుత్వాన్నీ కోల్పోడానికి ఇష్టపడని ఓ అమ్మాయి ప్రయాణమే ‘8 వసంతాలు’. 19ఏండ్ల వయసులో ప్రేమ, 27ఏండ్ల వయసులో ప్రేమ.. ఈ రెండు దశల్లోని మానసిక మార్పుని, పరిణతిని ఇందులో చూపిస్తున్నా. గురుశిష్య పరంపర కూడా ఈ కథలో భాగమే. కథ డిమాండ్ మేరకు కాశ్మీర్, కన్యాకుమారి, ఆగ్రా, ఊటీ.. ఇలా అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. ఆడియన్‌కి గొప్ప అనుభూతినిచ్చే సినిమా ఇది.’
అని దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెలిపారు. ఆయన దర్శకత్వంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్‌రోల్ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
‘ఈకథలో నేను రాసుకున్న శుద్ధి అయోధ్య పాత్రకు అనంతిక పర్ఫెక్ట్ యాప్ట్. నటిగానే కాక, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది. మార్షల్ ఆర్ట్స్ వచ్చు. చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అందుకే ఆమెను తీసుకున్నా. అనుకున్నట్టే పాత్రకు తను పూర్తిగా న్యాయం చేసింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు రెండూ రచయితలే. అందుకని ఎక్కడా గ్రాంధికం వాడలేదు. సంభాషణలన్నీ చక్కని తెలుగులోనే రాసుకున్నాను. భాషను బతికించే శక్తి సినిమాకు ఉంది. అందుకే స్ట్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నాను.’ అని తెలిపారు ఫణీంద్ర.