‘కరెంట్’, ‘కుమారి 21ఎఫ్’ వంటి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా ‘రంగస్థలం’ ‘పుష్ప’ సినిమాలకూ పనిచేశారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘18 పేజెస్’. ఈ సినిమా ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్.
‘కుమారి 21ఎఫ్’ వంటి హిట్ తర్వాత కూడా విరామం తీసుకున్నారెందుకు?
‘కరెంట్’ సినిమా పూర్తయ్యాక సుకుమార్ గారి జట్టులో చేరిపోయాను. ‘కుమారి 21ఎఫ్’ రిలీజ్ అయ్యాక ‘రంగస్థలం’ సినిమా వర్క్ జరుగుతోంది. ఆ టీమ్‌లో చేరితే దర్శకుడిగా ఇంకాస్త నేర్చుకోవచ్చు అని వెళ్లాను. ఆ తర్వాత ‘పుష్ప’ చిత్రానికి కూడా పనిచేశాను. దీంతో దర్శకుడిగా నా నెక్ట్స్ సినిమా ఆలస్యమైంది.
‘18 పెజెస్’ ఎలా ఉండబోతున్నది?
భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథా చిత్రమిది. సినిమా చూస్తున్నంతసేపూ ఆ పాత్రల్లో ప్రేక్షకులు తమని తాము పోల్చుకుంటారు. కథతో పాటే ట్రావెల్ అవుతారు. ఒక అనుభూతితో సాగే ఈ కథలో వచ్చే మలుపులు థ్రిల్‌ను పంచుతాయి. ముగింపు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అనుకున్న కథను తెరకెక్కించేందుకు ఎలాంటి రాజీ పడలేదు. ఇందుకు హీరోగా నిఖిల్ కూడా చాలా సపోర్ట్ చేశాడు.
ఈ చిత్రంలో సుకుమార్ తరహా కొత్త స్క్రీన్‌ప్లే ఉంటుందా?
సినిమాకు ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే రాయడం అంత సులువు కాదు. నేను, సుకుమార్ గారు కొన్ని చిత్రాలకు పనిచేసిన తర్వాత అదెలా ఉంటే బాగుంటుంది అనేది తెలుసుకున్నాం. అది ఇప్పుడు మా ఇద్దరికీ ఉపయోగపడుతున్నది. ప్రేక్షకులకు స్క్రీన్‌ప్లే నచ్చడానికి నచ్చకపోవడానికి చిన్న అడ్డంకి ఉంటుంది. దాన్ని తెలుసుకుంటే ఆకట్టుకునేలా కథను తెరపై చెప్పవచ్చు. ఈ కిటుకును సుకుమార్ గారు చిప్ అని పిలుస్తుంటారు. ఈ సినిమాలో అలాంటి కొత్త తరహా కథనాన్ని చూస్తారు.
మీ తదుపరి సినిమాల గురించి
నా నెక్ట్స్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో చేయాలని ఒప్పందం ఉంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలోనూ ఓ సినిమా చేయాలి. సుకుమార్ గారి దగ్గర నేను ఐదు కథలు తీసుకున్నా. వాటిలో రెండు తెరకెక్కించా. మరో మూడు రూపొందించాల్సి ఉంది. నా కథతోనూ ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది.