‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో చెప్పిన విషయాలతో ప్రేక్షకులు ఇప్పుటికీ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ప్రపంచం ఏమీ మారలేదు. మనం ఇంకా అదే లక్ష్యాల వైపు పరుగెడుతున్నాం. ఓరకంగా ఈ సబ్జెక్ట్‌కు ఇప్పుడు ఇంకా ప్రాధాన్యత పెరిగిందనుకుంటున్నా’ అన్నారు నాగ్అశ్విన్. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమా పతాకంపై స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించారు. ఈ సినిమా విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ నెల 21న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు నాగ్అశ్విన్ మాట్లాడారు. ఈ తరం వాళ్లు కూడా ఈ సినిమా చూసి ఎంతోకొంత పాజిటివిటీని అలవర్చుకుంటారనే ఉద్దేశ్యంతో రీరిలీజ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్ ఈ సంవత్సరాంతంలో మొదలవుతుందని, ప్రస్తుతం సన్నాహాలు చేసుకుంటున్నామని నాగ్ అశ్విన్ తెలిపారు. నానితో సినిమా చేద్దామనుకుంటే వర్కవుట్ కాలేదని, భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తానని నాగ్ అశ్విన్ తెలిపారు.