కథ బాగుంటే సినిమా హిట్టు. కథనం బాగుంటే రిపీట్ ఆడియెన్స్ వస్తారు. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తే.. పిల్లాజెల్లా కూడా చూస్తారు. ఓటీటీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఇంతకుమించి ఏదో ఉండాలి! అందుకే టేకింగ్ విషయంలో రాజీ అనేమాటకు చోటివ్వడం లేదు దర్శక నిర్మాతలు. అయినా ప్రేక్షక దేవుళ్ల కరుణా దృష్టి కాసుల వృష్టిగా కురవడం లేదు. వాళ్లను థియేటర్ల ముందు క్యూ కట్టేలా చేయాలంటే ఇంకేదో చేయాలని ఫిక్సయ్యారు. మల్టీస్టార్ తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు! ఘనమైన తారాగణం ఉంటే.. వారివారి అభిమానులు కదలివచ్చినా మినిమమ్ గ్యారెంటీ అని ఫిక్సవుతున్నారు సినీజనం. అందుకే, ఓ మోస్తరు చిత్రాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు మల్టీస్టార్స్కు పెద్దపీట వేస్తున్నారు.
Multi Starrer Movies | కథ డిమాండ్ చేసిందనే అనుకోండి, బడ్జెట్ లెక్కలు సరిచూసుకోవడానికే భావించండి.. ఇప్పుడు మల్టీస్టార్ మూవీ ఒక ట్రెండ్. గతంలో తెలుగునాట స్టార్‌హీరోలు జట్టు కట్టిన చిత్రాలు చాలానే వచ్చాయి. అయితే కాలక్రమంలో అవి తెరమరుగయ్యాయి. మళ్లీ 2000 సంవత్సరం తర్వాత అడపాదడపా బిగ్ హీరోల కాంబో సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ సినిమాలన్నిటిలో ఇద్దరు పెద్ద హీరోలు ఉండటం రివాజుగా మారింది. పాత్రలు ఏవైనా ఇద్దరు పెద్ద నటులు తెరపంచుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కల్కి 2898 ఏడీ’లో ఘనమైన తారాగణం కనువిందు చేయనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జతగా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె నటిస్తున్నది. ఇందులో ప్రతినాయకుడిగా కమల్‌హాసన్ కనిపిస్తుండటం విశేషం. మరో కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ అలరించనున్నాడు. అశ్వత్థామగా బిగ్ బి నటిస్తున్నాడని విడుదల చేసిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతున్నది. మరో ముఖ్యమైన పాత్రను రాజేంద్రప్రసాద్ పోషిస్తున్నాడట. ఇలా మొత్తంగా ఆరువేల సంవత్సరాల కాలక్రమంలో జరిగే కథగా తుది మెరుగులు దిద్దుకుంటున్న ‘కల్కి..’ తెరపై ఎన్ని మెరుపులు పంచుతుందో ఈ నెల 27న తేలనుంది.
తెలుగు తెరపై చిరకాలం గుర్తుండిపోయే సినిమాల్లో ‘శ్రీకాళహస్తి మహాత్మ్యం’ ఒకటి. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన ఈ సినిమా బాపు దర్శకత్వంలో ‘భక్త కన్నప్ప’గా అలరించింది. ఇందులో కృష్ణంరాజు హీరో. మళ్లీ అదే కథతో మంచు విష్ణు కథానాయకుడిగా ‘భక్త కన్నప్ప’ తెరకెక్కుతున్నది. అయితే ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్టు ఇండస్ట్రీ టాక్. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఎలాగైనా భారీ విజయం సాధించాలని భారీ తారాగణాన్ని ఎంచుకుంటున్నాడు. మోహన్‌బాబు, మలయాళ నటుడు మోహన్‌లాల్, కన్నడ హీరో శివ రాజ్‌కుమార్, తమిళ నటుడు శరత్ కుమార్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ‘భక్త కన్నప్ప’లో భాగమవుతున్నారు. ఆయా నటుల పాత్రలు, నిడివిపై ఇప్పటికింకా స్పష్టత రాకున్నా.. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఆల్ ఇండియా స్టార్స్ నటిస్తుండటం విశేషం.
మల్టీస్టార్ సినిమాలకు తమిళ దర్శకులు పెద్దపీట వేస్తుంటారు. ‘దళపతి’, ‘యువ’, ‘రావణ్’, ‘నవాబ్’, ‘పొన్నియిన్ సెల్వన్’ ఈ కోవకే చెందుతాయి. వీటిలో సింహభాగం విజయం సాధించినవే. తాజాగా కమల్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘థగ్స్ లైఫ్’లో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడట. ఇక శంకర్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ‘భారతీయుడు 2’లో కమల్‌తోపాటు సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న చిత్రంలో అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా కూడా ఉన్నారని కోలీవుడ్ టాక్.

టాలీవుడ్ విషయానికి వస్తే 1990 తర్వాత రెండు దశాబ్దాలపాటు స్టార్డమ్ ఉన్న హీరోలు మల్టీస్టారర్ చేసిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నా.. వీరిలో ఏ ఇద్దరూ జట్టు కట్టలేదు! తర్వాతి కాలంలో తెలుగు దర్శకులు సైతం మల్టీస్టార్ మూవీస్‌కు జై కొట్టడం మొదలైంది. రాజమౌళి ‘బాహుబలి’తో ఆ ట్రెండ్ మరింత ఊపందుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఏకంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను ఒకే స్క్రీన్‌పైకి తెచ్చి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాడు జక్కన్న. నాగార్జున, నాని కాంబోలో ‘దేవదాసు’ ఫలితం ఎలా ఉన్నా మల్టీస్టార్ మూవీగా పేరు దక్కించుకుంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో వెంకటేశ్, వరుణ్ తేజ్ హిట్ కాంబోగా నిలిచారు. చిరంజీవి రీ ఎంట్రీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ భారీ తారాగణానికి వేదికైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ పాత్రోచితంగా నటించి మెప్పించారు. మొత్తంగా టాలీవుడ్ కొత్తగా అందుకున్న ‘మల్టీస్టార్’ రాగం ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలి!

ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు ఆ స్థాయి హీరోలు అనిపించుకున్నారు. ఒకే తరానికి చెందిన ఈ హీరోలిద్దరూ ఎన్నో సినిమాల్లో జట్టుకట్టారు. పదిహేనుకు పైగా సినిమాల్లో వీళ్లు కలిసి నటించారు. ‘లక్ష్మీనివాసం’ సమయానికి ఇద్దరూ అప్‌కమింగ్ ఆర్టిస్టులే! ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’లో అతిథిపాత్రలో జోడుగా కనిపించారు. ‘మంచిమిత్రులు’ సినిమాతో కృష్ణ, శోభన్‌బాబు జట్టుకడితే సినిమాకు తిరుగు ఉండదని నిర్మాతలకు భరోసా వచ్చింది. ఎన్టీఆర్ లీడ్ రోల్లో వచ్చిన ‘విచిత్ర కుటుంబం’లో మరోసారి ఇద్దరూ కలిశారు. ఈ కాంబినేషన్లో సూపర్‌హిట్‌గా నిలిచిన మొదటి సినిమా ‘గంగ-మంగ’. వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన్‌బాబు మాస్, క్లాస్ పాత్రలతో అలరించారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ముందడుగు’ వీరిద్దరి నటనా వైచిత్రిని చాటి చెప్పింది. సంపన్నుడిగా శోభన్‌బాబు, కార్మికుడిగా కృష్ణ అదరగొట్టారు. ‘కురుక్షేత్రం’ సినిమాలో కృష్ణుడిగా శోభన్‌బాబు, అర్జునుడిగా కృష్ణ అలరించారు. ‘మండేగుండెలు’, ‘మహాసంగ్రామం’, ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ వీరిద్దరూ కలిసి నటించిన వాటిల్లో గుర్తుంచుకోదగ్గ సినిమాలు.
మల్టీస్టార్ మూవీస్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ హక్కుగా ఉండేది. తెలుగులోనూ అగ్ర కథానాయకులు జతకట్టిన సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏయన్నార్ జట్టుగా వచ్చిన సినిమాలు కొన్ని సంచలన విజయాలు సాధించాయి. వీరిద్దరూ మొదటిసారి కలిసి నటించిన సినిమా ‘పల్లెటూరి పిల్ల’. అప్పటికి ఏయన్నార్ స్టారే అయినా.. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి కొత్తే! తర్వాతి కాలంలో ఈ జోడీ వెండితెరపై కనిపించిన ప్రతిసారీ కలెక్షన్ల వర్షం కురిసింది. ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’, ‘గుండమ్మకథ’ లాంటి టాలీవుడ్ ఎవర్గ్రీన్ చిత్రాల్లో వీరిద్దరూ సమ ఉజ్జీలుగా కనిపిస్తారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో టైటిల్ రోల్ ఏయన్నార్ పోషిస్తే, కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ నటించారు. ‘భూ కైలాస్’లో రావణబ్రహ్మగా ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషిస్తే.. ఏయన్నార్ నారదుడిగా మెప్పించాడు. ఇలా వీరిద్దరి కాంబో నిర్మాతలకు దండిగా కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ ఎవర్గ్రీన్ జాబితాలో చోటు దక్కించుకుంది.