తెలుగువన్ వ్యవస్థాపకుడు కంఠమనేని రవిశంకర్ ‘రాజధాని ఫైల్స్’ చిత్రంలో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన రెండో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. రచయిత జనార్దన మహర్షి కథ, కథనం, మాటలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ సంక్షోభాన్ని ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు కంఠమనేని రవిశంకర్ తెలిపారు.
సామాజిక బాధ్యతతో కూడిన కథాంశమిదని, సమాజంలోని సమస్యలపై అందరికీ అవగాహన కల్పించాలనే మంచి ఆలోచనతో ఈ సినిమా చేస్తున్నామని, వచ్చే ఏడాది విడుదల చేస్తామని కంఠమనేని రవిశంకర్ తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వై.జితిన్కుమార్, సమర్పణ: కె.హిమబిందు, నిర్మాణం: తెలుగువన్ ప్రొడక్షన్స్.