గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ‘మ్యాడ్’ సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘మ్యాడ్ స్వేర్’. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రధారులు. కల్యాణ్‌శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ‘మ్యాడ్’ని మించేలా ‘మ్యాడ్ స్కేర్’ ఉంటుందని, పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని, మరోసారి అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్ అని ప్రధాన పాత్రధారులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ అన్నారు. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా చూడాలని చిత్ర సమర్పకులు సూర్యదేవర నాగవంశీ చెప్పారు.
‘మ్యాడ్’కి పదింతలు వినోదాన్ని ‘మ్యాడ్ స్కేర్’ ఇస్తుందని దర్శకుడు కల్యాణ్‌శంకర్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 29న థియేటర్లలో ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోండని నిర్మాత హారిక సూర్యదేవర అన్నారు. ఇంకా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా మాట్లాడారు. సితార ఎంటైర్టెన్మెంట్స్ అండ్ ఫార్చూన్‌ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై ఈ సినిమాను రూపొందించారు.