దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) మెగా ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ, లోహిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే దర్శకుడు బాబీ షూట్‌ని మొదలుపెట్టనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు మెగాస్టార్ ఇంట్రడక్షన్ సీన్‌ని తీసేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ ఎంట్రీ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం భారీ సెట్స్‌ని నిర్మిస్తున్నారు. ఈ సీక్వెన్స్‌లో మెగాస్టార్‌ని కొత్తగా చూపించేందుకు బాబీ ప్రణాళికలు రచిస్తున్నారు. చిరంజీవితోపాటు మొత్తం నలభై మంది ఫైటర్స్ కూడా ఈ సీక్వెన్స్‌లో కనిపిస్తారట. కుటుంబ భావోద్వేగాలే ప్రధానంగా సాగే ఈ కథలో చిరంజీవి పాత్ర చిత్రణ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంటుందని సమాచారం. గతంలో చిరు, బాబీ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా అంతకు మించి ఉంటుందని డైరెక్టర్ టీమ్ చెబుతున్నది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారు.