Ram Charan | రామ్‌చరణ్, బుచ్చిబాబు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారైనట్టు వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పుడు ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కథ రీత్యా ఇందులో రెండు క్రీడలు కీలకంగా ఉంటాయట. ప్రధమార్ధం అంతా క్రికెట్ నేపథ్యంలో కథ సాగుతుంది. ద్వితీయార్ధంలో కుస్తీ కీలకం అవుతుందట. అందుకే అటు కుస్తి.. ఇటు క్రికెట్ కలిసొచ్చేలా.. ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని సమాచారం.
దర్శకుడు బుచ్చిబాబు దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్ట్‌పై పనిచేశారు. విజయ్‌సేతుపతి లాంటి అభిరుచి గల నటుడు ఈ కథను అద్భుతం అన్నారట. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్న బుచ్చిబాబు, రెండో సినిమాతోనే టాప్ స్టార్ రామ్‌చరణ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఎలాగైనా ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించాలనే కసితో ఈ సినిమాకు ఆయన పని చేస్తున్నారట. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రధారులు. ఏఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి.