వాణిజ్య చిత్రాలకు చిరునామాగా నిలిచారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘భద్రా’ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ‘అఖండ 2 : తాండవం’ వరకూ ఆయన తీసిన సినిమాలను గమనిస్తే అదెంత నిజమో అవగతమవుతుంది. అగ్రహీరో బాలకృష్ణతో వరుసగా సింహా, లెజెండ్, అఖండ చిత్రాలను తెరకెక్కించి విజయవంతంగా హ్యాట్రిక్‌కి పూర్తి చేసిన బోయపాటి.. ఈ నెల 12న ‘అఖండ -2 : తాండవం’తో నాలుగోసారి బాలకృష్ణ నటవిశ్వరూపాన్ని తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్న బోయపాటితో సరదాగా కాసేపు..
డబ్బు కోసం మాత్రమే ఈ సినిమా చేయలేదు. మన ధర్మం ఎంత గొప్పదో తెలియజేసేందుకు ఈ సినిమా చేశాం. బిడ్డ పుట్టగానే పేగు తెంచి దేవుడికి ముడివేస్తాం. దేవుడి పేరే బిడ్డకు పెట్టుకుంటాం. వాడు ఎదుగుతుంటే దేవుడి దయ అనుకుంటాం. లోకాన్ని విడిచిపెడితే.. దేవుడి దగ్గరకి వెళ్లాడంటాం. మనకు కష్టం వచ్చినా దేవుడే, అనందం వచ్చినా దేవుడే.. దైవం భారతీయతలో మిళితమైపోయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన సినిమా ఇది. ఇందులోని పవర్ఫుల్ కమర్షియల్ అంశాలను ఆడియన్స్ ఊపిరి బిగపట్టుకొని చూస్తున్నారు. సాధారణంగా సినిమా విజిట్‌కి వెళ్లినప్పుడు మమ్మల్ని చూసి అంతా నిలబడి విజిల్స్ వేసి, క్లాప్స్ కొడుతుంటారు. కానీ ఈ సినిమా విజిట్‌కి వెళితే జనం లేచి చేతులెత్తి దండం పెడుతున్నారు. దర్శకుడిగా ఈ సినిమా నా గౌరవాన్ని పెంచింది.
అవెంజర్స్ సినిమాకు ఎంత స్కోప్ ఉందో ఈ సినిమాకు అంత స్కోప్ ఉంది. అవెంజర్స్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్,.. ఇవన్నీ సృష్టించిన పాత్రలు. కానీ మన చరిత్రలో ఇలాంటి పాత్రలు చాలా కనిపిస్తాయి. కురుక్షేత్రంలో వాడిన ఆయుధాల రేడియేషన్ ఇప్పటికీ మన వాతావరణంలో కనిపిస్తుందంటారు. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు మనం ఎన్నయినా చూపించొచ్చు. ఇక్కడ లాజిక్కులతో పనిలేదు. సంకల్పం ఉంటే చాలు. అష్టసిద్ధి సాధన చేసినవాళ్లు అత్యంత శక్తివంతులవుతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సినిమాలోని సూపర్ హ్యూమన్‌కి లాజికల్‌గా వివరణ ఇచ్చాం. సాధారణ సినిమాల్లోని యాక్షన్ సీన్స్ కంటే కాస్త అతీతంగా ఉండాల్సిన అవసరం ఈ కథకు ఉంది. అలా చూపించకపోతే ఈ పాత్ర సూపర్ పవర్ అవ్వదు.
ఈ సినిమా పిల్లలకు బాగా నచ్చింది. త్రీడీలో చూసేందుకు పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం రెవెన్యూ చాలా బావుంది. ఇతర రాష్ర్టాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఓ పదిరోజుల్లో నా నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వివరాలు చెప్తాను.