Daku Maharaaj | ‘50ఏండ్ల బాలకృష్ణగారి కెరీర్లో వందకు పైగా సినిమాలు చేస్తే.. వాటిలో గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటి లిస్ట్‌లో ‘డాకు మహారాజ్’ చేరుతుంది. చక్కని కథ, కథనాలతోపాటు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ‘డాకు మహారాజ్’ సొంతం.’ అన్నారు దర్శకుడు బాబీ కొల్లి. ఆయన దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా ఆదివారం(నేడు) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బాబీ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
‘బాలకృష్ణగారి ఇమేజ్‌ని, ఆయన సినిమాపై అభిమానుల్లో ఉండే అంచనాలనూ దృష్టిలో పెట్టుకొని ‘డాకు మహారాజ్’ తీశాను. మునుపెన్నడూ చూడని కొత్త బాలయ్యను ఈ సినిమాలో చూస్తారు.’ అని తెలిపారు బాబీ. దర్శకుడికి బాలకృష్ణ ఎంతో గౌరవం ఇస్తారని, అభిమానులకోసం డూప్ లేకుండా నటిస్తారని, మొండిగా ఆయన గుర్రాన్ని కంట్రోల్ చేసే తీరును చూసి ఆశ్చర్యమేసిందని, అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారని బాబీ చెప్పారు.
‘చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్లతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. సినిమా విషయంలో వారిద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరిలో క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పనిరాక్షసులే. నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో పనిచేస్తారు. సినిమాకోసం నిరంతరం శ్రమిస్తారు. అలాగే వెంకటేష్‌గారు కూడా. వారి నుంచి చాలా నేర్చుకున్నా’ అని తెలిపారు బాబీ.