‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ గ్రామదేవతల నేపథ్యంలో సాగే సోషల్డ్రామా ఇదని సమాచారం. కథానాయికగా సాయి పల్లవి ఖరారయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయని, మార్చిలో లాంఛనంగా ప్రారంభోత్సవం జరిపి, ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారని అంటున్నారు. ‘బలగం’ తర్వాత వేణు యెల్దండి దర్శకత్వంలో రానున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.