‘మా సినిమాలో ‘ధర్మం అంటే దేవుడు..’ అనే ఓ డైలాగ్ ఉంటుంది. కథ సారాంశం మొత్తం అందులో కనిపిస్తుంది. అంతర్లీనంగా ఈ విషయాన్ని చెబుతూ వాణిజ్య హంగులతో ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల. ఆయన నిర్ధేశకత్వంలో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘హను-మాన్’ ఫేమ్ ప్రశాంత్‌వర్మ కథనందించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘ఈ సినిమా కథలో మహాభారతంలోని కంసుడు, కృష్ణుడి రెఫరెన్స్ ఉంటుంది.
తన చెల్లెలికి పుట్టే మూడో సంతానంతో మామకు మరణం ఉంటుందని ట్రైలర్లోనే చెప్పాం. ప్రశాంత్‌వర్మ అందించిన కథకు నా ఆలోచనలను జతచేసి మరింత మెరుగ్గా తీర్చిదిద్దాం. విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంది. నేను సూచించిన మార్పులకు ప్రశాంత్‌వర్మ హ్యాపీగా ఫీలయ్యారు.’ అన్నారు. ట్రైలర్లో ‘మురారి’ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ “మురారి’లో విధి అనే అంశం ఉంటుంది. మా సినిమాలో ఆ పాయింట్‌ను మరో విధంగా చూపించాం. అంతకుమించి ఆ సినిమా కథతో ఎలాంటి పోలికలు ఉండవు. హీరోకు ఓ గండం ఉంటుంది. దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది.’ అని తెలిపారు. ఇదొక డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, మహేష్‌బాబుగారికి ట్రైలర్ బాగా నచ్చి టీమ్ అందరిని ప్రశంసించారని, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుందని అర్జున్ జంధ్యాల పేర్కొన్నారు.