Director Vamsy | ఒకప్పుడు వంశీ కథలు మాట్లాడాయి. సినిమాలు మాట్లాడాయి. ఇప్పుడు వంశీ మాట్లాడుతున్నాడు. ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు. వెన్నెల్లో గోదారి ముచ్చట్లు.. కన్నుల్లో తడి ఉబికే కబుర్లు.. నిద్ర గన్నేరు తనపై వేసిన ముద్రలు.. రాజుగారి హోటేలు రుచులు.. అచ్చంగా వరద గోదారిలా మాటలతో హోరెత్తిస్తున్నాడు. యూట్యూబ్ విస్తట్లో వారం వారం ఫ్లాష్‌బ్యాక్ సంగతులను.. అచ్చ తెలుగులో వండి వారుస్తున్నాడు! త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో కిలోగ్రాముల కొద్దీ జ్ఞాపకాలు పంచుకుంటానని చెబుతున్నాడు. దశాబ్దాలుగా మాటల్లో చాలా పొదుపరి అని పేరున్న కథకుడు, దర్శకుడు వంశీకి ఇప్పుడు ఇంతలా ఎందుకు పొలమారిందో తెలుసుకునే ప్రయత్నమే ఇది..
వంశీ గారూ! ఎందుకు సడన్‌గా రూటు మార్చారు. రాయడం, తీయడం కాకుండా ఇంతలా మాట్లాడుతున్నారేంటి?
నేనేం రూటు మార్చలేదండి! కాలంతోపాటు మారుతూ ఈ పని చేస్తున్నాను. కారణం ఏమీ లేదు. జనానికి ఏదో చెబుదాం అనిపించిందంతే! ఎవరినీ నొప్పించడం, ఇబ్బంది పెట్టడం నాకు చేతకాదు. అలా చేయకూడదని కూడా నాకు తెలుసు. నా అనుభవాలు, జ్ఞాపకాలు పంచుకోవాలనిపించింది. అందుకే ఈ ప్రయత్నం. ఎక్కడైనా నేను పొరపాటు చేస్తే.. మళ్లీ నేనే సవరించుకుంటాను. ఇప్పటికైతే.. అలాంటి సందర్భం రాలేదు!
రచయితలు మాట్లాడితే.. ప్రసంగంలా ఉంటుంది. కానీ, మీరు చాలా కులాసాగా మాట్లాడతారు. ఈ కళ ఎలా అబ్బింది?
తెలియదండి. మనం చదువుకున్న పుస్తకాలు, సాహిత్యం వల్ల అలా అబ్బిందేమో! నేను చాలా క్యాజువల్‌గానే మాట్లాడతాను. వచ్చింది చెప్పేయడమే!
చాలామంది సెలెబ్రిటీలు.. ఫ్యాన్స్‌కు దగ్గరవ్వడానికి సామాజిక మాధ్యమాల్లోకి వస్తున్నారు. మీరు కూడా ఈ తరానికి చేరువ కావడానికి చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చా?
నేను యూట్యూబ్ చానల్ మొదలుపెట్టి ఏడాది అయింది. రానున్న 20వ తేదీ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తున్నాను. రోజుకో రీల్ చేయాలనుకుంటున్నా! నేను చెప్పేవన్నీ నా జ్ఞాపకాలే ఉంటాయి. ఈ తరానికి చెబుదాం అనిపించింది. వీళ్లందరికీ దగ్గరై.. నేను అనుకున్నది చెప్పాలనే ప్రయత్నం!
మీ వీడియోలకు వచ్చే కామెంట్స్ చదువుతుంటారా! వాటిని చూసినప్పుడు మీకెలా అనిపిస్తుంటుంది?
చాలా తక్కువ! నా తాలూకు మనుషులు వాటిని చదువుతుంటారు. నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటారు. అయితే ఇంతవరకైతే నెగెటివ్ కామెంట్స్ రాలేదని చెప్పారు. సబ్‌స్ర్కైబర్స్ పెరిగితే నేనింకా ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆ పనిలో కూడా ఉన్నాను. అలాగని పనిగట్టుకొని చేసేదేం ఉండదు. నా జ్ఞాపకాలు పంచుకుంటూ పోవడమే చేస్తాను.
మీరు రాసిన ‘పొలమారిన జ్ఞాపకాలు..’ టైటిల్ సాంగ్‌లో ‘పోట్లాడిన జ్ఞాపకాలు..’ అని కూడా ఉంది కదా! ఇప్పటి వరకు ఎక్కడా పంచుకోని ఓ పోట్లాడిన జ్ఞాపకం మాతో పంచుకుంటారా?
పోట్లాడిన జ్ఞాపకాలు చెబితే.. పేజీలు సరిపోవేమో! ఓ పనిచేస్తాను. ఫలానా పత్రిక నుంచి ఇలా మీరు అడిగినట్టు, దానికి నేను చెప్తానన్నట్టు చెబుతూ… ఆ డిటెయిల్స్ పంచుకుంటాను. పేపర్ మీద రాయడానికి రెండు వాక్యాల్లో సరిపోదు. కాస్త వివరంగా చెప్పాలి.
మీరు చాలా ఇంటర్వ్యూల్లో పలు ప్రశ్నలకు మర్చిపోయాను, గుర్తులేదు అంటుంటారు. కానీ, ఈ జ్ఞాపకాల్లో ప్రతి సందర్భాన్నీ అంతలా ఎలాగుర్తుపెట్టుకున్నారు?
ఏమో అంతగా అబ్జర్వ్ చేయలేదు. నేను చెబుతూ ఉంటే.. అలా జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి. నేను చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించి పనిగట్టుకొని ప్రయత్నం కూడా చేయను. ఆ క్షణాన నాకు గుర్తొచ్చింది చెప్పడమే! నా చుట్టూ ఉన్నవాళ్లను అడగడం కూడా చేయను. నాతో పనిచేసిన వాళ్లకు ఫోన్ చేసి ‘అప్పుడేం జరిగింది, ఇలా జరిగింది కదా!’ అని అడగడం లాంటివి చేయను. ఆ మూమెంట్‌కి మనసులో మెదిలింది చెప్తుంటాను అంతే! వీటిలో కల్పనలకు తావు లేదు. అప్పుడు జరిగింది.. ఇప్పుడు చెబుతున్నాను.
‘మంచుపల్లకీ’తో మొదలైన మీ సినీప్రస్థానం మీకు సంతృప్తినిచ్చిందని భావిస్తున్నారా?
ఏ మాత్రం ఇవ్వలేదనే చెబుతాను. నేను చేయాల్సింది చాలా చాలా ఉందనిపిస్తుంది. ఇప్పటివరకు పెద్దగా నేనేం చేయలేదు. చేస్తానని మాత్రం చెప్పగలను. నాకు సంతృప్తి కలిగేలా చేయాలని ఉంది. చేస్తాను.
మీరు రాసిన ‘మహల్లో కోకిల’ నవలకు దృశ్యరూపం ‘సితార’ చిత్రం. నవల్లో ఉన్నట్టు సినిమాలో చూపించగలిగారా?
లేదు! నవల్లో వేరేలా ఉంటుంది. అంశం అదే అయినప్పటికీ.. సినిమాకు వచ్చేసరికి వేరే అయింది. నా వరకైతే సినిమా కన్నా.. నవలే బాగుంది. ఎందుకంటే.. ‘సితార’లో సెకండాఫ్, ైక్లెమాక్స్ సినిమాటిక్ అయిపోయింది. సినిమా అంటే.. పది మందీ చూడాలి కాబట్టి.. ఆ ప్రొడ్యూసర్ ఏదో చెబుతారు, ఇంకా ఎవరెవరో ఏవేవో చెబుతూ ఉంటారు. సితార సమయంలో ఇవన్నీ వినాల్సి వచ్చింది. ఆవిధంగా ఫినిష్ చేయాల్సి వచ్చింది. నవల ముగింపు అలా ఉండదు! వేరేలా ఉంటుంది. అంతేకాకుండా, ఆ నవలను సినిమాగా చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ లేదు. హీరో చివర్లో బతకాలని నిర్మాత అన్నారు. ఇది తెలుగు సినిమా అనే పద్ధతిలో మాట్లాడేసరికి.. వాళ్ల మాటలను గౌరవించి ఇప్పుడున్న సినిమాలా మార్చాను. చిత్రం విజయవంతం అయినప్పటికీ.. నా మటుకు నవలే బాగుంది.
పొలమారిన జ్ఞాపకాల్లో గానీ, తాజాగా ఫ్లాష్‌బ్యాక్ వీడియోల్లో గానీ ఇళయరాజా గురించి, మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి ప్రధానంగా చర్చిస్తుంటారు? అయితే, గీత రచయితల గురించి ప్రత్యేకంగా పంచుకున్న సందర్భాలు తక్కువనే చెప్పాలి. ఎందుకలా?
నిజమే! నేను సాహిత్యం బాగానే చదివాను. ఇంకా చెప్పాలంటే తెలుగు పంచకావ్యాలు, సంస్కృత పంచకావ్యాలు కూడా చదివాను. పొయెట్రీ మీద ఆసక్తి ఎక్కువ. సినిమా పాట పాపులర్ కావడానికి సాహిత్యం కావాలి. కానీ, నా మక్కువంతా ట్యూన్ మీదే ఎక్కువగా ఉంటుంది. అది ఎలా వచ్చిందో తెలియదు. సాహిత్యం కన్నా ట్యూన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అది మొదట్నుంచీ ఉంది. నా కెరీర్లో ఒకట్రెండు పాటలు మినహా.. మిగతావన్నీ ట్యూన్‌కు రాయించుకున్నవే!
వంశీ సినిమా అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వాళ్లు! మీరు.. తరచూ గ్యాప్ ఇస్తూ వచ్చారు! ‘ఫ్యాషన్ డిజైనర్’ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మీ సినిమా మళ్లీ ఎప్పుడొస్తుంది?
ఎప్పుడూ సినిమా తీయబోయే ముందు.. మంచి సినిమానే తీస్తున్నామని మొదలుపెడతాం. రకరకాల సందర్భాలు, పరిస్థితులు, అనుభవాలతో ఆ సినిమా ఒక రూపానికి వస్తుంది. నేను సాటిస్ఫై అయింది, లేనిది ఎక్స్‌ప్రెస్ చేస్తూ వచ్చా ఇంత వరకు. సినిమా చాలా అద్భుతంగా ఉండాలి, ఉంటుంది అనే స్టార్ట్ చేస్తాను. సాధ్యమైనంత తొందర్లోనే నా కొత్త సినిమా మొదలవుతుంది. మంచి సినిమా అవుతుందనీ, నాకు సంతృప్తి కలిగిస్తుందనీ నమ్ముతున్నా!
మీరు గతంలో తీసిన సినిమాలకు సీక్వెల్‌గా ఏదైతే బాగుంటుందని మీ అంచనా! ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ సీక్వెల్‌గా తీసిందేనా! ‘ఏప్రిల్ 1 విడుదల’కు సీక్వెల్ వస్తే బాగుంటుందని మీ అభిమానుల కోరిక. దీనిపై మీ స్పందన?
‘ఫ్యాషన్ డిజైనర్’ సీక్వెల్ కాదు. ఆ కథ కూడా నాది కాదు. అతనెవరో కథతో వస్తే.. నాకు అవసరమై సినిమా చేశానంతే! అది సీక్వెల్ అస్సలు కాదు. ఆయనలా టైటిల్ అనుకున్నారంతే!! ఆయన చేయమని అడిగారని చేశా! కానీ, సీక్వెల్ మోజులో చేసింది కాదు. ‘ఏప్రిల్ 1 విడుదల’ సీక్వెల్ రావాలని ఎవరు అనుకున్నా.. నాకలాంటి ఆలోచన లేదు. ఈ సినిమాకనే కాదు.. దేనికీ అలాంటి ఆలోచన లేదు.
రచయితగా మీది ప్రత్యేకమైన శైలి. మీరు రాసిన వాటిల్లో మీకు నచ్చింది ఏంటి?
పెద్దగా ‘ఆహాఁ’ అని సాటిస్ఫై అవ్వలేదు నేనింకా! రచయిత సంతృప్తి చెందకూడదేమో కూడా! సినిమా డైరెక్టర్ కూడానూ! అయితే అక్కడితో ఆగిపోతాడేమో!! నాకు ఇంకా గొప్పగా ఏదో చేయాలి, మరేదో రాయాలనిపిస్తుంటుంది.
‘వంశీకి నచ్చిన కథలు’ రెండు సంకలనాల రూపంలో వచ్చాయి. వాటిలో అన్ని కథలూ ముచ్చటైనవే! అయితే, అద్భుతం అనిపించుకున్న కొన్ని కథలకు అందులో చోటు దక్కలేదని కొందరి విమర్శ! దీనికి మీరేమంటారు?
ఆ విమర్శ ఉందేమో! ఒక పెద్ద బుక్ డిస్ట్రిబ్యూటర్ నాతో ‘వంశీ కథంటే కొంటారేమో జనం.. వంశీకి నచ్చిన కథలంటే కూడా కొంటారంటారా?’ అని అడిగారు. ‘ఏమోనండీ! నాకు నచ్చినయని.. ఎవరికి వాళ్లు నచ్చి తీసుకుంటారేమో కదా!’ అన్నాను. ఆ బుక్ డిస్ట్రిబ్యూటర్‌కు ఈ పుస్తకాలు పంపించాను. లక్కీలీ ఆ పుస్తకాలు కూడా బాగా అమ్ముడయ్యాయి. ‘ఏవండీ! ఇవ్వి కూడా బాగా అమ్ముడయ్యాయి’ అని ఆయనే చెప్పారు. పోనీలే నాకు నచ్చినవి.. జనాలకు కూడా నచ్చుతాయనిపించింది. నాకు నచ్చిన కథలతో మరిన్ని సంకలనాలు తేవాలని భావించాను. అయితే, ఒక పెద్దాయన, సాహితీపరుడు ఏం చెప్పాడంటే.. ‘రెండు భాగాలతో ఆపేయండి. ఇంకా వేసుకుంటూ వెళ్తే, ‘ఇతనికిదో పనైపోయింది’ అని ఎవరైనా కామెంట్ చేసే ఆస్కారం ఉంద’న్నారు. అది నాకూ సబబుగానే అనిపించింది. యాక్చువల్‌గా నాకు నచ్చిన కథలతో థర్డ్ పార్టు, ఫోర్త్ పార్టు తెద్దునేమో! కానీ, ఆ పెద్దాయన సలహా విని రెండు భాగాలతో మానేశాను.
మీరు చూసిన, తెలిసిన కొన్ని పాత్రలను డ్రమటైజ్ చేసి కథలుగా ఆవిష్కరిస్తారు కదా! ఆయా వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడైనా కలిసి.. బాగా రాశారనో, ఎందుకలా రాశారనో అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
పసలపూడి కథల్లో… కొందరి పేర్లు నేను మార్చి రాస్తే.. ఆ వ్యక్తులు నన్ను కలిసి ‘నా అసలు పేరు ఎందుకు పెట్టలేదు?’ అని అడిగారు. ‘ఆ కథలో చెప్పిన పనులన్నీ నువ్వు చేయలేదు కదా. నువ్వు చేయనప్పుడు నీ పేరు ఉంచడం సరికాదని.. పేరు పెట్టలేద’ని చెప్పా! ‘పెట్టుంటే సంతోషించేవాణ్ని.. ఏముందీ, ఆ పని నేను చేశానే అనుకో’ అన్నారు. అలాగని వాళ్ల ఒరిజినల్ పేరు పెడితే.. రేపొద్దున వాళ్లు హర్ట్ అయ్యి ఏదైనా అనొచ్చు. ఆ స్కోప్‌లేకుండా పేర్లు మార్చాను. ‘దిగువ గోదావరి’ కథల్లో ఒక కథ చదివిన ఒకాయన మనవడు.. ‘మా తాతగారి పేరు యాజిటీజ్‌గా ఉంచితే బాగుండేది కదండీ! పేరెందుకు మార్చారు’ అన్నాడు. కొంతమంది ఇలాగ అన్నారు తప్ప, ఎవరూ యాంటీగా ప్రవర్తించిన వాళ్లూ, మాట్లాడిన వాళ్లూ లేరు. ‘సిల్లీఫెలో శ్రీరామ్మూర్తి’ కథలో ఒరిజినల్ పేరే! శ్రీరామ్మూర్తి పాడేరులోని హాస్టల్ వార్డెన్‌గా చేసేవారు. ఆయన పేరు అలాగే ఉంచితే ఎంతగానో సంబరపడ్డారు.
గోదావరి అంటే మీకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు! ఆ నదంటే ఎందుకంత అభిమానం?
నా చిన్నప్పటి నుంచీ గోదావరిని చూస్తూనే ఉన్నాను. గోదావరి నాకొక తల్లి, ఒక చెల్లి, ఒక ప్రేయసి, ఒక స్నేహితురాలు. నాకు సర్వం గోదావరే. రెగ్యులర్‌గా గోదారిని చూస్తూనే ఉంటాను. ముఖ్యంగా పాపికొండల దగ్గరికి వెళ్తే.. గోదావరిని చూస్తూ అలా ఉండిపోతాను.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, పాపికొండలు కనుమరుగైతాయి కదా! ఆ అందాలు మిస్ అవుతారా?
పోలవరం పూర్తయితే పాపికొండలు మొత్తం మునిగిపోతాయి. ఇప్పుడు గోదావరి ఈ విధంగా అందంగా ఉంది. అప్పుడు మరో విధమైన అందం అక్కడ రూపాంతరం చెందుద్దేమో! ఇంకోవిధంగా అలరిస్తుందేమో! ఎందుకంటే.. గోదావరి ఎప్పుడూ అలాగే ఉండాలనుకోవడం కూడా తప్పు కదా! లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి ఎప్పుడూ అందంగానే ఉంటుంది. మరో రూపాన్ని, మరింత అందాన్ని సంతరించుకుంటుంది. గోదావరిని ఇష్టపడే నేను దాని పరివాహక ప్రాంతాన్నంతా ఇష్టపడతాను. రీసెంట్గా బాసర కూడా వెళ్లొచ్చాను. మొన్నా మధ్య.. షిరిడీ వెళ్లాను. అక్కడికి సమీపంలో గోదావరి ఉంటుందంటే.. బాబా దర్శనం తర్వాతలే అనుకొని ముందుగా అక్కడికి వెళ్లిపోయాను. అంత ఇష్టం ఆ నదంటే నాకు!
ఇటీవల కుమారదేవం గ్రామంలో నిద్ర గన్నేరు చెట్టు నేలకొరిగినప్పుడు సరాసరి అక్కడికే వెళ్లారు. ఆ చెట్టుతో మీకున్న అనుబంధం చెబుతారా?
గోదావరి గట్టుమీదున్న ఆ చెట్టంటే నాకెంతో అభిమానం. ఆ చెట్టు నీడన రాత్రీపవలూ నేను గడిపిన సందర్భాలు కోకొల్లలు. ఆ ప్రాంతాల్లో సినిమా తీస్తే.. షాట్ తీయకపోయినా, ఆ చెట్టు దగ్గరికి కచ్చితంగా వెళ్తుండేవాణ్ని. ఎందుకంత ఆకర్షణ అని అడుగుతుంటారు! ఆ చెట్టు కింద కూర్చుంటే తప్ప తెలియదు ఆ అనుభూతి. విచిత్రమేంటంటే కూలిపోయిన ఆ చెట్టు ఇప్పుడు మళ్లీ చిగురిస్తోంది. త్వరలో ఆ చెట్టు చెంత వీడియో చేస్తానేమో!
ఇటీవల మీ జీవితభాగస్వామి దూరమైనప్పుడు ఓ వీడియోలో గోదారి చూపించమన్న ఆమె కోరిక నెరవేర్చలేక పోయానని చాలా బాధపడ్డారు. ఎప్పుడూ గోదావరి చుట్టూ తిరిగే మీరు.. మీ భార్య కోరిక తీర్చలేక పోయినందుకు ఫీలవుతున్నారా?
గోదావరిలోని పట్టిసీమ వీరభద్ర రేవుకు తీసుకెళ్లమనేది. గోదావరి మధ్యలో ఉంటుందది. అక్కడ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటాననేది. ఆమె కోరిక నేను ఎన్నడూ తీర్చలేకపోయాను. ఆమెను అక్కడికి తీసుకెళ్లలేనప్పుడు ఫీలవ్వలేదు కానీ, ఎక్కడికైతే తను తీసుకెళ్లమందో.. ఆ ప్రదేశంలో ఆవిడ అస్తికలు కలిపినప్పుడు ఆ రాత్రి చాలా ఫీలయ్యాను.
మీరూ తిరువణ్నామలై (అరుణాచలం) తరచూ వెళ్తుంటారా? అక్కడికి వెళ్లినప్పుడు మీలో కలిగే అనుభూతి?
తిరువణ్నామలై నేనేం కొత్తగా వెళ్లడం లేదు. 1977 ప్రాంతాల్లో చలం గారిని చూడటానికి వెళ్లాను మొట్టమొదట. అప్పుడు రమణాశ్రమం చూశాను. అప్పట్నుంచి ఇప్పటిదాకా వెళ్తూనే ఉన్నాను. కొత్తగా నాలో ఆధ్యాత్మిక కోణం ఏం రాలేదు. మొదట్నుంచీ ఉన్నదే! రీసెంట్గా ఇళయరాజా గారి మ్యూజిక్‌లో రెండు పాటలు రాయడానికి చెన్నై వెళ్లాను. రాజాగారు వేరే సినిమా ఆర్ఆర్ పనిలో ఉండటంతో.. తిరువణ్నామలై దాకా వెళ్లొచ్చాను.
మీ కోణంలో దైవం అంటే ఏమిటి?
ఎవరో సృష్టికర్త లేకుండా.. ఈ ప్రపంచం నడవదు కదా! అది ఈశ్వరుడు అనండీ, అరుణాచలేశ్వరుడు అనండీ.. ఈ ప్రపంచాన్ని ఒక సృష్టికర్త నడుపుతున్నాడు మనందర్నీ అనేది నిజమని నమ్ముతాను.
ఓ సందర్భంలో మీకు ఆర్కే నారాయణ్ ‘మాల్గుడి డేస్’ ప్రేరణ అని చెప్పారు. ఆయనేమో లేని ‘మాల్గుడి’ అనే ఊరును సృష్టించారు. మీరేమో మీకు తారసపడిన కొందరు వ్యక్తులను పసలపూడి వారిగా చెబుతూ కథలు రాశారు! ఇదేదో గమ్మత్తుగా ఉందే!ఆ సంగతేంటో కాస్త వివరిస్తారా?
‘మాల్గుడి డేస్’ నాకు ప్రేరణ అన్నది నిజమే! అయితే మాల్గుడి కల్పితం. పసలపూడి యథార్థం. ఏవో కొన్ని పాత్రలను పసలపూడికి ఆపాదించాను కానీ, చాలా పాత్రలు అక్కడివే! చుట్టుపక్కల గ్రామాల్లోని మనుషులనీ పసలపూడి వారిగా చూపించాను. మొదట్నుంచీ కూడా అబ్జర్వ్ చేయడం ఇష్టం. ఆ ఇష్టాన్ని నా ప్రొఫెషన్‌కు అడాప్ట్ చేసుకున్నానేమో! దేవుడు మనకు కండ్లు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు. మనం చూసింది, విన్నది.. రాసే కథల్లో, చేసే సినిమాల్లో చూపించే ప్రయత్నం చేస్తుంటాను. ఈ సమయంలో పసలపూడి ఊళ్లోని ఓ వీధి ఫొటో చూస్తున్నాను. పసలపూడి కథలు రెండో భాగం రాద్దామని కొన్ని ఐడియాలు పెట్టుకొని.. రాయలేకపోతున్నా. ఏమవుతుందో చూడాలి.
మీ కథల్లో, సినిమాల్లో గోదావరి ఉప్పొంగుతుంటుంది. అదే గోదావరి ప్రధాన ఇతివృత్తంగా ఏదైనా నవలగానీ, కథగానీ ఆశించొచ్చా?
గోదావరి పుట్టిన నాసిక్ త్రయంబకం నుంచి గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది దగ్గర అన్నాచెల్లెలు గట్టువరకు ఈ బ్యాక్‌డ్రాప్‌లో నేనొక నవల రాయబోతున్నా. పద్నాలుగు వందల పేజీల నవల అది. దీనికి పేరు కూడా పెట్టాను. కాకపోతే ఇప్పుడే చెప్పలేను. అయితే, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా దాదాపు పదిహేను మందిని తీసుకెళ్లి సర్వే చేయాలి. అదైతే గానీ నవల రాయలేను. ఈ పద్నాలుగు వందల పేజీల నవల.. మీరొక పేజీ చదివాక అర్జెంట్‌గా మరోపేజీలోకి వెళ్లిపోవాలి. అంత కుతూహలం, అంత ఆత్రుత కలిగే విధంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఎందుకంటే, ఆ ఇతివృత్తం అలాంటిది. దాని తాలూకు నేను అనుకున్న కథనం అలాంటిది. సర్వే ఎందుకంటే.. ఏ కల్పనా లేకుండా అన్నీ యథార్థాలే రాయాలనుకుంటున్నాను. నేను విన్నవి కాదు. కళ్లతో చూడాలి. అలా చూడాలంటే.. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పది, పదిహేనుమందితో వెళ్లాలి. రెండు గట్లవెంబడీ సర్వే చేయాలి. సమాచారమంతా సంగ్రహించాలి. అప్పుడు గానీ నేను రాయను, రాయలేను.
ఈ బృహత్ కార్యం ఎన్నటికి పూర్తవుతుంది. గోదావరి నవల పాఠకులకు ఎప్పుడు అందుతుంది?
కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే.. గోదావరి ఒక ఒడ్డు సర్వే చేయడానికి నలభై రోజులకన్నా ఎక్కువ సమయమే పడుతుంది. మరో గట్టువైపు ఇంకో నలభై యాభై రోజులు. ఈ సర్వే ఖర్చు విషయానికి వస్తే.. ఇటుపక్క ఓ నలభై లక్షలు, అటు పక్క ఓ నలభై లక్షలు వెచ్చించాల్సి వస్తుంది. ఒక రీజనల్ లాంగ్వేజ్ బుక్ మీద ఎనభై లక్షల రూపాయలు ఎక్కడా రావు కదా! ఇవన్నీ నేను పడాల్సిన పాట్లు!
శ్రమజీవి.. చిరంజీవి
జీవితంలో చాలా చాలా కృషి చేసి పైకి వచ్చిన వాళ్లలో నేను ముగ్గురు, నలుగురిని ఎరుగుదును. అంతా ఇంతా కృషి చేయలేదు వాళ్లు. ఆ నలుగురు.. చిరంజీవి, ఇళయరాజా, బాపు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లు. చిరంజీవి శ్రమజీవి. ఎంతో కష్టపడి పైకొచ్చారు. ఆయన కెరీర్, నా కెరీర్ దాదాపు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. కష్టపడి అంత శ్రమపడి తనదంటూ ఒక ైస్టెల్ కోసం ఎంతో తాపత్రయపడ్డ మనిషి ఆయన. అంతకంతా జీవితంలో సాధించారు. ఆయన నాతో ఎప్పుడూ శ్రమ విలువ గురించే చెబుతూ ఉండేవారు.
…? త్రిగుళ్ల నాగరాజు