అగ్ర నటుడు ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ పానిండియా పౌరాణిక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నది. షణ్ముఖపురాణంలోని ఓ కీలక ఘట్టం ఆధారంగా ఈ సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించనున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో కుమారస్వామిగా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ని త్రివిక్రమ్ ఇప్పటికే పూర్తి చేశారట. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ అప్డేట్ రానుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ అనౌన్స్మెంట్ వీడియోను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కథ, కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో హింట్ ఇవ్వనున్నారట. హై విజువల్ ఎఫెక్ట్స్‌తో పవర్ఫుల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ వీడియోను డిజైన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక, తారక్ ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. నిజంగా తారక్ అభిమానుల్లో జోష్ని నింపే వార్త ఇది.