Dimple Kapadia | బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలో ‘దిల్ చాహ్తా హై ఒకటి. ఈ సినిమాకు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించగా.. 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఇటీవల వేవ్స్ సమ్మిట్‌లో పాల్గోన్న ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోకపోతే బహుశా సినిమానే ఆపేయాల్సి వచ్చేదని అన్నారు. తారా పాత్ర ఆమె కోసమే రాశానని, ఆమె ఒప్పుకున్నందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినని ఆయన పేర్కొన్నారు. అయితే డింపుల్ కపాడియా నాకంటే పెద్దది కావడంతో సెట్స్‌లో తనని ఎలా పిలవాలో అర్థం కాలేదని చెప్పుకోచ్చాడు.
ఫర్హాన్ అక్తర్ మాట్లాడుతూ.. ‘దిల్ చాహ్తా హై’ సినిమా షూటింగ్ సమయంలో డింపుల్ కపాడియాను ఎలా పిలవాలో తెలియక తాను చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. ఆమెను డింపుల్ ఆంటీ అని పిలిస్తే చాలా కోప్పడతారని, కేవలం డింపుల్ అని పిలిస్తే మర్యాదగా ఉండదని భావించానని ఫర్హాన్ తెలిపారు. దీంతో షూటింగ్ సమయంలో ఆయన ఆమెను ఎక్కువగా ‘జీ జీ’, ‘యస్ యస్’, ‘ఓకే ఓకే’, ‘మేడమ్’ అని పిలిచినట్లు తెలిపాడు.
కొన్ని రోజుల తర్వాత డింపుల్ కపాడియా నా దగ్గరకు వచ్చి ఫర్హాన్ నన్ను ఎందుకు పేరు పెట్టి పిలవడం లేదని అడిగారు. అప్పుడు నేను మీరు నాకంటే పెద్ద అందుకే ఎలా పిలవాలో అర్థం కాలేదని చెప్పగా.. ఆమె నవ్వుతూ “నన్ను డింపుల్ అని పిలువు. ఒకవేళ నీ నోటి నుండి ‘డింపుల్ ఆంటీ’ అని వస్తే, నేను ఈ సినిమాను వదిలి వెళ్ళిపోతాను” అని సరదాగా హెచ్చరించినట్లు చెప్పుకోచ్చాడు.
‘దిల్ చాహ్తా హై’ 2001లో విడుదలైంది. ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా, ప్రీతి జింటా, సోనాలి కులకర్ణి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. డింపుల్ కపాడియా ఇందులో తారా జైస్వాల్ అనే ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు.