‘ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక తెలుగు రాష్ర్టాల్లో చాలా సింగిల్ స్క్రీన్స్ మూసివేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో ‘హిట్-3’ మీద అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ప్రేక్షకులు థియేటర్లకు రాబోతున్నారని హ్యాపీగా ఫీలయ్యాం. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ మళ్లీ ఉపిరి పీల్చుకుంది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు.
నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్-3’ గురువారం విడుదలై హిట్‌టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో దిల్‌రాజు మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. నాని మాట్లాడుతూ ‘సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి. అంతటా సూపర్‌హిట్ టాక్ వినిపిస్తున్నది. ప్రేక్షకులు, నేనూ ఒకటేనని ఎప్పుడూ నమ్ముతాను.
ఈ సినిమా విజయంతో మరోసారి నా నమ్మకం నిజమైంది. ఈరోజు రాత్రి అమెరికా వెళ్తున్నా. నాలుగు రోజుల తర్వాత తిరిగొస్తా. అప్పుడు గ్రాండ్‌గా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రశాంతి తిపిర్నేని పాల్గొన్నారు.