Dil Raju | ‘కేజీఎఫ్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలన విజయాలు అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న దిల్ రాజు.. వందలాది సినిమాల నిర్మాణం, పంపిణీ చేసిన అనుభవంతో ‘టాక్సిక్’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘కేజీఎఫ్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్ ఓ ప్రయోగాత్మక దర్శకురాలితో సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు తొలుత ఆశ్చర్యం కలిగిందని చెప్పారు.
అయితే ముంబైలో ఈ సినిమా రషెస్, విజువల్స్ చూసిన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని దిల్ రాజు తెలిపారు. యశ్ ఆలోచనలు కేవలం పాన్-ఇండియా స్థాయికి మాత్రమే పరిమితం కాలేదని, భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే బలమైన లక్ష్యం ఆయనలో కనిపిస్తోందని ప్రశంసించారు. ‘టాక్సిక్’ సినిమాపై తనకు ఎంతటి నమ్మకం ఉందో దిల్ రాజు మరో విషయంతో స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఎలాంటి సందేహం లేకుండా నిర్మాత అడిగిన ధరకు తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ సినిమా కంటెంట్, విజువల్స్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే హక్కుల విషయంలో ఒక్క క్షణం కూడా వెనుకాడలేదని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ధైర్యాన్ని కూడా దిల్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ‘టాక్సిక్’ బాక్సాఫీస్ సామర్థ్యంపై దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిత్ర సంగీత దర్శకుడు విశాల్ మిశ్రాతో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ.. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.2,000 కోట్ల వరకు వసూళ్లు చేసే సత్తా ఉందని ఆయన అభిప్రాయపడ్డారని తెలిపారు. అయితే ఇది సినిమా విడుదలకు ముందే ఏర్పడిన భారీ అంచనా మాత్రమే. సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో విడుదల తర్వాతే స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ వేడుకలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో విషయంపై కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. రాకింగ్ స్టార్ యశ్‌తో తమ బ్యానర్లో సినిమా చేయడం నూటికి నూరు శాతం ఖాయమని ఆయన ప్రకటించారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సరిపోయే బలమైన కథ సిద్ధమైన తర్వాతే సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలిపారు. యశ్‌తో చర్చలు జరిగాయని, ఇద్దరి కాంబినేషన్‌కు తగిన కథ కుదిరిన వెంటనే ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని చెప్పినట్లు సమాచారం.