Re Make | తెలుగు బ్లాక్‌బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ కానుందంటూ నెట్టింట పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో అనీల్ రావిపూడి తెరకెకక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పొంగల్ 2025 సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది . దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. బాలీవుడ్ రీమేక్ స్టార్ అక్షయ్ కుమార్‌తో సంప్రదింపులు కూడా చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది.
అక్షయ్ కుమార్ ఇప్పటికే ‘భూల్ భులయ్యా 2’, ‘రౌడీ రాఠోర్’, ‘లక్ష్మీ’ వంటి దక్షిణాది రీమేక్‌లతో హిట్ ట్రాక్‌లో ఉన్నారు. అయితే ఇటీవల వరుస ఫ్లాపులతో అక్షయ్ కుమార్ కెరీర్ ఒడిదుడుకుల్లో సాగుతోంది. ఈ సమయంలో ఆయన మళ్లీ సౌత్ ఇండస్ట్రీ సూపర్ హిట్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి కథను ఎంచుకుంటే సేఫ్ జోన్లో పడతాడని విశ్లేషకులు కూడా అంటున్నారు. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం, దిల్ రాజు ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో నిర్మించేందుకు బాలీవుడ్ మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం . వెంకటేష్ చేసిన పాత్రకు అక్షయ్ కుమార్ సరైన ఎంపిక అని చాలా మంది భావిస్తున్నారు.
తెలుగులో ఈ సినిమా విజయానికి కథ కంటే కూడా వెంకటేష్ టైమింగ్, కామెడీ టచ్, అనిల్ రావిపూడి మేకింగ్ ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథ, స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటివి లేకపోతే , ఈ సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రీమేక్ వార్తలు బయటకు వచ్చిన వెంటనే, తెలుగు నెటిజన్లు దిల్ రాజుపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. రూ.300 కోట్లు వచ్చాయని ఇలాంటి మంచి సినిమాని హిందీలోకి తీసుకెళ్లి డిజాస్టర్ చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.