Dil Raju | తెలుగు సినిమాలు విడుదల రోజే పైరసీ అవుతున్న సందర్భంగా వాటిని అరికట్టేందుకు ఒక ఉద్యమం రావాలని ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు అన్నారు. దిల్ రాజ్ నిర్మాణంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu). విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రకాశ్ రాజ్ జయసుధ తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం 2013న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చి 12 ఏండ్లు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్(Seethamma Vakitlo Sirimalle Chettu Re Release) చేస్తున్నారు మేకర్స్.
మార్చి 07న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండగా.. ఈ సందర్భంగా దిల్ రాజు ప్రెస్‌మీట్ నిర్వహించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చి 12 ఏండ్లు అవుతున్న ఈ సినిమాను ఇంకా ఆదరిస్తున్నారు. రీరిలీజ్ ఓపెనింగ్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో పది థియేటర్లు హౌస్‌ఫుల్స్ అయిపోయాయి. ఆంధ్రాలో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ వసూళ్లు చూస్తుంటే మాలో కొత్త ఎనర్జీ వస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో యాడ్ చేయడానికి ఎక్స్ ట్రా ఫుటేజ్ చాలా ఉంది. కానీ అలాంటి ప్రయోగాలు ఏమీ చేయట్లేదు. ఇంతకు ముందు ఉన్న సినిమాను అలాగే విడుదల చేస్తున్నాం. మంచి చిత్రాలు ఎన్నిసార్లు రిలీజ్ చేసినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారంటూ దిల్ రాజ్ తెలిపాడు.
ఈ క్రమంలోనే తెలుగు సినిమాను భూతంలా పీడిస్తున్న పైరసీకి సంబంధించి స్పందించారు దిల్ రాజు. పైరసీని అరికట్టేందుకు ఒక ఉద్యమం రావాలని దిల్ రాజు అన్నారు. పైరసీని అరికట్టేందుకు మనం అందరం కలిసి ఒక ఉద్యమం లాంటిది తీసుకురావాలి. చాలామంది నిర్మాతలు తమ సినిమా విడుదల సమయంలో మాత్రమే ఈ సమస్య గురించి మాట్లాడతారు, కానీ ఆ తర్వాత అందరూ దాన్ని మర్చిపోతారు. అందుకే ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంటోంది అంటూ చెప్పుకోచ్చాడు దిల్ రాజు. పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే అక్రమ వెబ్సైట్లలో అందుబాటులోకి వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే, నిర్మాతలతో పాటు దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్లు మరియు ప్రేక్షకులు కూడా సహకరించాలని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. పైరసీ విషయంలో నిర్మాతగానే కాకుండా.. ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నేను లీడ్ తీసుకుంటాను. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేద్దాం అంటూ దిల్ రాజు వెల్లడించాడు.