Producer Dil Raju | టాలీవుడ్లో పేరు మోసిన నిర్మాతల్లో దిల్‌రాజు ఒకడు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్‌రాజు అంచెలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా సినిమాలను నిర్మించే స్థాయికి వెళ్లాడు. ఇండస్ట్రీలో చాలా మంది దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగులేదని అంటుంటారు. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు కానీ, మూడేళ్ల కిందట బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉండేవాడు. ప్రస్తుతం దిల్‌రాజు పాన్ ఇండియా లెవల్లో గేమ్‌చేంజర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని బడ్జెట్ సుమారు మూడొందల కోట్లకు పై మాటే అని ఇన్సైడ్ టాక్. నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్‌గానూ చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న జైలర్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది దిల్‌రాజే.
ఇక దిల్‌రాజు హిందీలోనూ పాగా వేయాలని గట్టి ప్లాన్లే చేస్తున్నాడు. అల్లు అరవింద్‌తో కలిసి జెర్సీ రీమేక్ చేస్తే.. పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి రాలేవు. ఇక రాజుకుమార్ రావుతో హిట్ సినిమాను రీమేక్ చేస్తే తొలిరోజే బెడిసి కొట్టింది. పడ్డచోట లేవాలని కసితో హిందీలో సాలిడ్ హిట్టు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఓ వైపు బోని కపూర్‌తో కలిసి ఎఫ్-2 రీమేక్ పనుల్లో బిజీగా ఉంటూనే.. మరో బాలీవుడ్ హీరోతో భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షేర్షా సినిమాతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రాతో ఓ సినిమాను సెట్ చేసే పనిలో ఉన్నాడట. దీనిని హిట్ ఫ్రాంచైజీ దర్శకుడు సైలేష్ కొలను తెరకెక్కించనున్నాడట.
ప్రస్తుతం చిత్రయూనిట్ కథా చర్చల్లో ఉందట. అన్నీ కుదిరితే ఇదే ఏడాది చివరికల్లా లాంఛనింగ్ కార్యక్రమాలు జరుపుకోనుందట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఇటీవలే దిల్‌రాజు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా విజయం సాధించాడు. ప్రత్యర్థి నిర్మాత సి. కళ్యాణ్‌పై 17ఓట్ల తేడాతో గెలుపొందాడు.