Dil Raju | విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ నెల 5న విడుదలైంది. అయితే, చిత్రం రివ్యూలపై నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన ఒకలా ఉందని.. సోషల్ మీడియాలో మరోలా ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయారు. సినిమాపై నెగెటివ్ ప్రచారం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిదికాదన్నారు.
ఓ సినిమాను ప్రేక్షకుల ఆదరణ పొందలేదనే విషయాన్ని అంగీకరించాల్సిందేనన్న నిర్మాత.. మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. సినిమాను చూసిన తల్లిదండ్రులు, తాతలు, బామ్మలు బాగుందని చెబుతున్నారని, ఫ్యామిలీ ఆడియన్స్కు మూవీ రీచ్ అయ్యిందన్నారు. ఫామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి ‘ఫ్యామిలీ స్టార్’ని ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. తాను చెప్పదలచుకున్నది ఒక్కటే ఉందన్నారు. తాము మంచి సినిమానే తీశామని.. థియేటర్లకు వచ్చి చూడాలని.. నచ్చితే నలుగురికి చెప్పాలన్న ఆయన.. నచ్చపోతే ఆ విషయాన్ని తాము కూడా అంగీకరిస్తామన్నారు.
సినిమాను చూసిన వారు కొందరు తనకు మెసేజ్లు పంపుతున్నారని.. కొందరు కాల్ చేస్తున్నారని. మరికొందరు కలిసి మాట్లాడారని తెలిపారు. సినిమా బాగుందని.. నెగెటివ్ ప్రచారం ఎందుకు వస్తుంది? అంటూ తనను ప్రశ్నిస్తున్నారన్నారు. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూసి ఆస్వాదించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. నగరంలోని ఓ సినిమా థియేటర్ వద్ద ఆయన సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అభిప్రాయం సేకరించారు. సినిమా బాగుందని పలువురు దిల్ రాజుకు తెలిపారు. నెగెటివ్ టాక్పై తప్పుపట్టారు.