‘సినిమాలో ఏదో ఒక ఎగ్జెయిట్మెంట్ అంశం ఉంటే తప్ప ఈవెంట్స్‌కు రావాలనిపించదు. ఈ సినిమా పేరు చెప్పగానే ‘ఏమున్నవే పిల్లా..’ అనే పాట గుర్తుకొచ్చింది. సాంగ్ అంత ఆదరణ పొందిందంటే ఖచ్చితంగా సినిమాలో ఏదో విషయం ఉంటుందని అర్థమైంది’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. శనివారం హైదరాబాద్‌లో ‘నల్లమల’ చిత్ర ట్రైలర్‌ను ఆయన ఆవిష్కరించారు. అమిత్‌తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ద్వారా రవిచరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆర్.ఎమ్.నిర్మాత. దిల్‌రాజు మాట్లాడుతూ ‘తొలుత ఈ కార్యక్రమాన్ని పెద్ద హోటల్లో పెడుతున్నామని చెప్పారు. ఎక్కడ ఈవెంట్ చేసినా నేనొస్తాను..నిర్మాతకు ఖర్చు తగ్గించమని చెప్పాను. సినిమాలో కథలో కొత్తదనం ఉంటే ఎక్కడ ఈవెంట్ చేసినా చూస్తారు’అన్నారు. ‘త్రివిక్రమ్, రాఘవేంద్రరావు, దేవాకట్టా వంటి ప్రముఖులు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమిది’ అని దర్శకుడు తెలిపారు.