‘గేమ్‌ఛేంజర్’ ప్రమోషన్స్ విషయంలో ఇప్పటివరకూ నార్మల్ స్పీడ్‌తో వెళుతున్న నిర్మాత దిల్‌రాజు గేర్ మార్చారు. రీసెంట్గా అమెరికా డల్లాస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించిన ఆయన.. తెలుగు రాష్ర్టాల్లో నిర్వహించనున్న ఈవెంట్‌పై తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయాన్ని ఫైనల్ చేసేందుకు ఆదివారం ఆయన విజయవాడ చేరుకున్నారు. అక్కడి బృందావన కాలని, వజ్రా మైదానంలో ఏర్పాటు చేసిన 256 అడుగుల ‘గేమ్‌ఛేంజర్’ రామ్‌చరణ్ కటౌట్‌ని ఆవిష్కరించిన దిల్‌రాజు.. ఫ్యాన్స్‌తో మాట్లాడారు. ‘ఈ కటౌట్‌తో రికార్డ్ నెలకొల్పిన మెగా ఫాన్స్‌కి ధన్యవాదాలు.
సుప్రీంహీరో చిరంజీవితో మొదలైన మీ అభిమానం ఆయన కుటుంబంపై కూడా ప్రసరిస్తూనే ఉంది. ఒక్కరే బాస్.. ఆయనే మెగాస్టార్. మనందరికీ ఓ పవర్స్టార్నీ, మెగా పవర్‌స్టార్‌ని అందించడంతోపాటు అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, సాయిదుర్గతేజ్ తదితరులను ఇచ్చారాయన. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌గారిని కలిసేందుకే ఇక్కడకు వచ్చాను. ఆయన ఆధ్వర్యంలోనే వేడుక జరిగితే బావుంటుందనేది మా అభిప్రాయం. ఆయన డేట్‌ని బట్టి ఈవెంట్ ఎక్కడో నిర్ణయిస్తాం. ఈ ఈవెంట్‌తో చరిత్ర సృష్టిద్దాం’ అని తెలిపారు దిల్‌రాజు. చిరంజీవి ఈరోజే సినిమా చూశారని, మెగాహిట్ కొట్టబోతున్నామని ఫోన్ చేసి అభినందించారని, ఈ సందర్భంగా దర్శకుడు శంకర్‌ని ఆయన అభినందించారని, జనవరి 1న ట్రైలర్ విడుదల చేస్తామని దిల్‌రాజు చెప్పారు. తన సంస్థ నుంచి వస్తున్న ఈ 50వ సినిమా.. చరిత్రలో నిలుస్తుందని దిల్‌రాజు నమ్మకం వెలిబుచ్చారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల ఆవుతున్న విషయం తెలిసిందే.