ఇక నుంచి పూర్తిస్థాయిలో దర్శకత్వం, సినీ నిర్మాణంపై దృష్టి పెట్టబోతున్నానని చెప్పారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. ప్రస్తుతం ఆయన ‘దీక్ష’ పేరుతో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘మూడు దశాబ్దాల కెరీర్లో ఇప్పటివరకు 36 చిత్రాలను నిర్మించి, 7 చిత్రాలకు దర్శకత్వం వహించాను.
సుదీర్ఘ విరామం తర్వాత మెగాఫోన్ పట్టి ‘దీక్ష’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా వివిధ కార్యకలాపాల్లో బిజీగా ఉండటం దర్శకత్వానికి బ్రేక్ వచ్చింది. దర్శకనిర్మాతగా నా వృత్తిని నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. కృష్ణగారితో ‘సర్దార్ సర్వాయి పాపన్న’ చిత్రాన్ని చేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది.
రాబోవు రోజుల్లో పూర్తిస్థాయిలో డైరెక్షన్, ఫిల్మ్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇటీవల ‘దీక్ష’ అనే చిత్రాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత ‘లేడీ కబడ్డీ జట్టు’ సినిమా చేయబోతున్నా. దీనిని 18 భాషల్లో చేయబోతున్నాం. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. ‘దీక్ష’ కొత్త షెడ్యూల్ వచ్చే వారం మొదలవుతుంది’ అన్నారు.