ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన రెండు మూత్రపిండాలు పనిచేయకపోవడంతో డయాలసిస్ చేస్తున్నారు. 88 ఏండ్ల శ్యామ్ బెనగల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు సమాచారం. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ జీవిత కథ ఆధారంగా ‘ముజిబ్, ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ అనే చిత్రాన్ని రూపొందిస్తానని ఇటీవల శ్యామ్ బెనగల్ ప్రకటించారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ సినిమా ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. ‘అంకుర్’, ‘నిషాంత్’, ‘మంథన్’, ‘భూమిక’ లాంటి చిత్రాలతో సమాంతర సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన దర్శకుడిగా శ్యామ్ బెనగల్ ప్రసిద్ధుడు. చిత్రరంగానికి ఆయన చేసిన సేవలకు అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నారు.