Dhurandhar | బాలీవుడ్లో ఇటీవలే భారీ సంచలనం సృష్టించిన చిత్రం ‘దురంధర్’ ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఓటీటీకి వచ్చిన తొలి రోజుల్లోనే దురంధర్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే నెట్‌ఫ్లిక్స్‌కు దాదాపు 3 లక్షల కొత్త సబ్స్క్రైబర్లు చేరినట్టు సమాచారం.
కేవలం ఒక సినిమా కోసం ఇంతమంది కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అంటే దురంధర్‌పై ప్రేక్షకుల్లో ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు, మళ్లీ మరోసారి చూడాలనుకున్నవాళ్లు ఓటీటీలో ఈ సినిమాను భారీగా వీక్షిస్తున్నారు. అయితే, ఈ భారీ ఆదరణ మధ్యలోనే మేకర్స్‌పై ప్రేక్షకుల అసంతృప్తి కూడా బయటపడుతోంది. ముఖ్యంగా ఓటీటీ వెర్షన్ రన్‌టైమ్ విషయంలో ఆడియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో విడుదలైనప్పుడు దురంధర్ సినిమా రన్‌టైమ్ 3 గంటల 45 నిమిషాలుగా ఉండగా, ఓటీటీలో మాత్రం 3 గంటల 35 నిమిషాల వెర్షన్‌ను స్ట్రీమ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దాదాపు 10 నిమిషాల కంటెంట్ కట్ చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు కీలక సన్నివేశాలు తొలగించారని, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేశారని ఆరోపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే నేరుగా నెట్‌ఫ్లిక్స్‌కు కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. ‘థియేటర్ వెర్షన్‌నే ఓటీటీలో కూడా ఇవ్వాలి’ అనే డిమాండ్‌తో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మేకర్స్ లేదా నెట్‌ఫ్లిక్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. దురంధర్ సినిమా విషయానికి వస్తే, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ‘యూరీ: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. యువ నటి సారా అర్జున్ కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో సింగిల్ లాంగ్వేజ్‌లోనే విడుదలై ఏకంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది.