Dhurandhar2 | బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్ 2’ (ధురంధర్: ది రివెంజ్) పైరసీ ఉచ్చులో చిక్కుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం.. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో లీక్ కావడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా పూర్తి నిడివి గల పైరేటెడ్ వెర్షన్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు యూట్యూబ్‌లో అక్రమంగా అప్లోడ్ చేశారు. దీంతో మొబైల్ ద్వారా రికార్డ్ చేసిన దాదాపు 4 గంటల నిడివి గల ఈ వీడియోను అప్పటికే వేలాది మంది నెటిజన్లు వీక్షించారు. అయితే ఈ పైరసీ అప్‌లోడ్‌ను గమనించిన అభిమానులు వెంటనే సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఆదిత్య ధర్‌ను ట్యాగ్ చేస్తూ అలర్ట్ చేశారు. ఇక అభిమానుల నుంచి వచ్చిన సమాచారంతో చిత్రబృందం తక్షణమే రంగంలోకి దిగి, యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. ఆ పైరేటెడ్ లింక్‌ను విజయవంతంగా డిలీట్ చేసింది యూట్యూబ్.
మరోవైపు ఈ పైరసీ అడ్డంకులు వలన సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు తగ్గలేదు. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1400 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచి ‘బాహుబలి 2’ రికార్డులను సైతం అధిగమించింది. రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ప్రస్తుతం రికార్డుల వేటను కొనసాగిస్తోంది.