Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ సీక్వెల్ విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇండియాలో మాత్రమే ఈ సినిమా రూ.687.43 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేయడం విశేషం. సుమారు 3 గంటల 49 నిమిషాల భారీ రన్ టైమ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాల మేళవింపుతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఆదరణే కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది.
వీక్‌డేస్‌లో కూడా సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. 5వ రోజు: రూ.65 కోట్లు, 6వ రోజు (మార్చి 24): రూ.56.55 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. మంగళవారం థియేటర్ల ఆక్యుపెన్సీ 36.6% గా నమోదవ్వడం సినిమా స్టామినాను చూపిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించడం ద్వారా ధురంధర్: ది రివెంజ్ వేగంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకుపోతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే, బాలీవుడ్లో అత్యంత వేగంగా 1000 కోట్ల మార్క్ అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 17,910 షోలతో సినిమా భారీగా ప్రదర్శితమవుతోంది.
హిందీ వెర్షన్: రూ.52.00 కోట్లు (36.7% ఆక్యుపెన్సీ), తెలుగు వెర్షన్: రూ.3.10 కోట్లు (42.0% ఆక్యుపెన్సీ), తమిళ వెర్షన్: రూ.1.10 కోట్లు రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన రావడం గమనార్హం. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ తన పవర్ఫుల్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. అతనితో పాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా, ముఖ్యంగా 26/11 ముంబై ఉగ్రదాడులు నేపథ్యంగా తెరకెక్కిన అండర్‌కవర్ ఆపరేషన్ కథతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది.