Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల కుబేర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల కన్నా తెలుగు ప్రేక్షకులనే ఎక్కువగా అలరించిది. ఇక ధనుష్ నటించిన రాంఝానా చిత్రం ఆగస్ట్ 1న మళ్లీ విడుదలైంది. 2013లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు రీరిలీజ్ జరుపుకోగా , ఇందులో క్లైమాక్స్‌ను ఏఐ సాయంతో మార్చడంపై ధనుష్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మార్పు వలన సినిమా ప్రమాదంలో పడుతుందంటూ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు ధనుష్. తన సోషల్ మీడియాలో.. “రాంఝానా” సినిమా కంటెంట్‌ను ఏఐతో మార్చడం బాధాకరం. ఇది నేను ఒప్పుకోలేదు.అయిన మార్చి ఆర్ట్, ఆర్టిస్ట్‌ని అవమానించారు. ఇలా చేయడం కథను చెప్పే విధానాన్ని మార్చడమే కాదు, సినిమా వారసత్వాన్ని హరించడమే. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అవసరం,” అని స్పందించారు.
సోనమ్ కపూర్ కథానాయికగా, ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన రాంఝానా సినిమాతో ధనుష్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, అప్పట్లో ఈ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయితే రీ-రిలీజ్ సమయంలో, ఏఐ సాయంతో క్లైమాక్స్‌ను మోడిఫై చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చర్యను ధనుష్ ఖండించారు. 12 ఏళ్ల క్రితం చేసిన కృషికి ఇది సరైన న్యాయం కాదన్నారు. ధనుష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు, ఇండస్ట్రీలోని పలువురు ఈ అంశంపై చర్చ ప్రారంభించారు. రాంఝానా టీమ్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ధనుష్ ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “కుబేర” మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించిన విషయం తెలిసిందే. నాగార్జున, రష్మిక మందన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అలాగే ప్రస్తుతం ధనుష్ దర్శకత్వం వహిస్తున్న “ఇడ్లీ కాదై” చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి. ఇదే కాదు, “తెరే ఇష్క్ మేన్” తదితర ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నారు.