‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ విషయంలో అగ్ర తారలు ధనుష్, నయనతార మధ్య తలెత్తిన కాపీరైట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. భర్త విఘ్నేష్‌శివన్‌తో కలిసి నయనతార ఈ కేసును ఎదుర్కొంటున్నది. ఆ డాక్యుమెంటరీలో తాను నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా తాలూకు బిహైండ్ ది సీన్స్ విజువల్స్‌ను వాడుకున్నారని ధనుష్ కొద్ది మాసాల క్రితం చెన్నై కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. నవంబర్‌లో ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆ సమయంలో డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని ధనుష్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
తాజాగా ఈ కేసు వచ్చే నెలలో హియరింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో ధనుష్ తరపు న్యాయవాదులు తాజా అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ‘నానుమ్ రౌడీదాన్’ షూటింగ్ సమయంలో దర్శకుడు విఘ్నేష్‌శివన్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడని, కథానాయిక నయనతారకు సంబంధించిన సన్నివేశాల విషయంలో ఎన్నోసార్లు రీటేక్ను తీసుకున్నారని, దానివల్ల ఇతర నటీనటులు ఇబ్బందిపడ్డారని, ప్రొడక్షన్‌కు కూడా నష్టం జరిగిందని, అందుకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో కోర్టు వెలువరించే తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.