ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కుబేర’ సినిమా ఓ విశేషాల సమాహారం. టైటిల్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ఇది. యువతరానికి నచ్చే కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల.. తమిళ స్టార్ హీరో ధనుష్‌ని మెయిన్‌లీడ్‌గా తీసుకొని సినిమా చేయడం, దానికితోడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండటం, ప్రచార చిత్రాల్లో విభిన్నత, శేఖర్ కమ్ముల సినిమాకు దేవిశ్రీ సంగీతం.. ఇవన్నీ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణాలు. అందుకే ‘కుబేర’ విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వారందరి ఎదురు చూపులకు తెరదించుతూ గురువారం మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ‘కుబేర’ విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో నెవర్ బిఫోర్ అనిపించేలా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని, ధనుష్, నాగార్జున, రష్మిక, జిమ్ సర్భ్ పాత్రలు.. ఆ పాత్రల చుట్టూ తిరిగే కథనం.. ఉద్వేగాలు ఊహలకు అతీతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా గురువారం రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల చేశారు. సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలనూ ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ మరోసారి పరిచయం చేశారు. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.